అవినాష్ రెడ్డి... సైలెంట్ అయిపోయిరా...
కడప, సెప్టెంబర్ 11,
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు నియోజకవర్గం కడప. అసలు రాష్ట్రంలో 25 స్థానాలు ఉన్నప్పటికీ.. ఇది వైఎస్ ఫ్యామిలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టే నియోజకవర్గంగా రికార్డుల్లోకి ఎక్కింది. గతంలో ఎందరో గెలిచినా.. వైఎస్ జగన్ రాజకీయ ప్రవేశం తర్వాత ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని ఇక్కడ గెలిపిస్తున్నారు. జగన్ నిలబెట్టిన అవినాష్ రెడ్డి ఇక్కడ నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించారు. యువకుడు, విద్యావంతుడు, దగ్గర బంధువు కావడంతో జగన్ అవినాష్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ.. రెండో సారి ఎంతో మంది పోటీ లో ఉన్నప్పటికీ.. టికెట్‌ను అవినాష్‌కే కేటాయించారు.అయితే, వంద రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. అవినాష్ పెద్దగా మార్కులు తెచ్చుకోలేక పోయారు. బొటా బొటి మార్కులతో మమ అని అనిపించుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఆ యన ఎంపీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. రెండోసారి గెలిచిన తనకు పార్ల మెంటరీ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన కినుక వహిస్తున్నారని అంటున్నారు. లోక్‌సభ పార్లమెంటరీ పక్ష నేతగా జగన్.. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.అయితే, ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్లో చోటు ఇవ్వడంతో మరోపదవిని కూడా ఆయన కుమారుడికే కట్టబెట్టడంపై అవినాష్ అలక బూనారని అప్పట్లోనే కథనాలు వచ్చాయి. అయితే, వీటిని లైట్ తీసుకున్న జగన్.. కనీసం అవినాష్‌ను పరామర్శించేందుకు కూడా ప్రయత్నించ లేదు. తనకన్నా వయసులో చిన్నవాడు కావడంతో పలకరించేది ఏంటిలే ! అని అనుకుని ఉంటారు. అయితే, స్థానికంగా కార్యకర్తలను ఏకతాటిపై నడిపించడంలోనూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలోనూ అవినాష్ పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు.పైగా పార్టీ తరపున ఏదైనా కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. ఆయన ఏదొక మిషతో తప్పించుకుంటున్నారు. కడపలో రైతులు ఇప్పుడు నీరు లేక గగ్గోలు పెడుతున్నారు. ఎంపీకి మొరపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన అప్పాయింట్‌మెంట్ కాదుకదా.. అడ్రస్ కూడా కనిపించడం లేదని సమాచారం. ఇక జిల్లాలో అధికారుల బదిలీలు, మాటవినే క్రమంలో కూడా అవినాష్ చెప్పినట్టు జరగడం లేదట. మొత్తానికి పదవుల విషయంలో తనకు అవమానం జరిగినట్టుగా అవినాష్ ఫీలవుతుండడంతో కడప రాజకీయం వేడెక్కింది.