కర్ణాటక ఉపఎన్నికలు వచ్చేస్తున్నాయ్...
బెంగళూర్, సెప్టెంబర్ 11,
కర్ణాటకలో ఉప ఎన్నికలు ఖాయంగా కన్పిస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల పై అప్పటి స్పీకర్
రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు తమపై స్పీకర్ వేసిన అనర్హతను తొలగించాలని పిటీషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టులో
స్పీకర్ నిర్ణయానికి విరుద్ధంగా వచ్చే అవకాశం లేదు.కొందరు న్యాయనిపుణులు చెబుతున్న ప్రకారం స్పీకర్ వేసిన అనర్హత వేటు పై న్యాయస్థానం తిరిగి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. పక్కన
ఉన్న తమిళనాడులో సయితం ఇదే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించిన సంగతిని గుర్తు న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు.
తమిళనాడులో కూడా అనర్హత వేటు పడిన శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఇప్పుడు కర్ణాటకలో సయితం అదే రకంగా ఉంటుందన్నది అంచనా వేసుకుంటున్నారు. దీనిపై చర్చించడానికి
కూడా సుప్రీంకోర్టు ఆసక్తికరంగా లేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ రకమైన సంకేతాలు ఇప్పటికే అందడంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగితే అనర్హత
వేటు పడిన వారు తిరిగి పోటీ చేసే అవకాశం లేదు. ఉప ఎన్నికలు గ్యారంటీ అని దాదాపుగా తెలియడంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు హస్తినలో మకాం వేసి బీజేపీ అధిష్టానం వైపు ఆశగా
ఎదురు చూస్తున్నారు.అందుకోసమే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల కోసం యడ్యూరప్ప ప్రత్యేకంగా ఒక ప్లాన్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 17 మంది ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు ఉప
ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం ఒకటి. వారసులు లేకుంటే వారు సిఫార్సు చేసిన వారికి ఇచ్చే అవకాశముంది. దీంతోపాటు అన్హత వేటు పడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కూడా
యడ్యూరప్ప జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారిని కలిసి వివరించనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో అతి కీలకమైన ఉప ఎన్నికలు
రావడం ఖాయమని దాదాపుగా తేలిపోయినట్లే.