అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు
గుంటూరు, సెప్టెంబర్ 11
పల్నాడులోని నరసరావుపేట, సత్తెపల్లి, గురజాల పోలీస్ డివిజన్ల పరిధిలోని చాలా గ్రామాల్లో రాజకీయ దాడులు జరిగాయి. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి, తుమ్మల చెరువు, కేసానుపల్లి, భట్లూరు, గుడిపూడి వంటి చాలా గ్రామాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. పల్నాడులో చాలా గ్రామాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ టీడీపీ ఆత్మకూరునే ఎందుకు ఎంచుకుందన్న విషయంపై సర్వ్రత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆ గ్రామానికే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారన్న విషయమై చర్చ నడుస్తోంది.ఫ్యాక్షన్ రాజ్యమేలుతున్న నాటి నుంచి పల్నాడులో ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. అనంతర కాలంలో ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక దుర్గి మండలం ఆత్మకూరు విషయానికొస్తే మూడు దశాబ్దాల క్రితమే రాజకీయ దాడులతో ఆత్మకూరు వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పడుతు ఇలాంటి పరిస్థతుల నెలకొన్నాయని
ఆ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.దశాబ్దాల కిందట 1989లోనూ ఆత్మకూరులో గొడవలు చెలరేగాయి. కక్షలు, కార్పణ్యాలతో టీడీపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఇళ్లు ధ్వంసం చేశారు. పొలాలు తగులబెట్టారు. అప్పట్లో ఆత్మకూరు దాడుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా ఆత్మకూరులో పర్యటించారు. కాంగ్రెస్ దురాగతాలను ఎండగట్టారు. అందుకే ఇప్పడు చంద్రబాబు కూడా ఆత్మకూరు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మామ ఎన్టీఆర్ బాటలోనే బాబు సాగుతున్నారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.