YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పంటకు ఊతం

పంటకు ఊతం

పంటకు ఊతం 
మచిలీపట్నం, సెప్టెంబర్ 12

ఈ ఏడాది ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో మాగాణి సాగుపై నెలకొన్న సందిగ్ధతను సాగర్‌ జలాల రాకతో అన్నదాతలు అధిగమించారు. నెల రోజులు ఆలస్యమైనా చెరువుల ఆయకట్టులోనూ వరినాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు రెండో జోన్‌ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులకు నీరు లేక ఖరీఫ్‌ వరి సాగు ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో 18 రోజులపాటు మధిర బ్రాంచి కెనాల్‌కు విడుదల చేసిన సాగర్‌ జలాలు రైతుల ఆశలకు జీవం పోశాయి. చెరువుల కింద వరి సాగుకు భరోసాను అందించాయి. పశ్చిమ కృష్ణాలోని చెరువుల ఆయకట్టులో ఏటా జులై నుంచి రైతులు వరినాట్లు ప్రారంభిస్తారు. జూన్‌ నుంచి కురిసే వర్షాలకు చెరువులకు నీరు చేరి అలుగులు పొంగి ప్రవహించి మాగాణి సాగుకు కర్షకులను సంసిద్ధులను చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు మొదటి పక్షం వరకు వర్షాలు ఆశించన మేరకు కురవకపోవడంతో చెరువులకు నీరు చేరలేదు. ఎన్నెస్పీ కాల్వల ద్వారా సరఫరా చేసే జలాలతో చెరువులు నింపుకొనే అవకాశం తిరువూరు, గంపలగూడెం మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు చెందిన రైతులకు ఉంది. గత ఆగస్టు 18 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు రెండో జోన్‌ పరిధిలోని మధిర బ్రాంచి కెనాల్‌కు సాగర్‌ జలాలను పుష్కలంగానే విడుదల చేశారు. అధికారులు, పలు గ్రామాల రైతులు వీటిని తమ చెరువులకు తరలించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో చెరువులకు చేరిన నీరు అలుగులపై ప్రవహించి వరినాట్లకు ఊతమిచ్చింది. సాగునీటి కొరతతో పంటలు సాగు చేయడంలో కాస్త ఆలస్యమైనా సమస్యను అన్నదాతలు అధిగమించారు. గంపలగూడెం మండలంలో 44 చెరువులు ఉండగా 20 చెరువులకు సాగర్‌ జలాలు చేరాయి. ఆగస్టు మొదటి పక్షంలో 20 చెరువుల్లో నీరు లేదు. మూడోజోన్‌ పరిధిలో 236 చెరువులు ఉండగా 40 వేల ఎకరాల మాగాణి సాగు ఉంది. అలాగే 2.52 లక్షల ఎకరాల ఆయకట్టు భూములు ఉండగా వీటిలో అన్ని రకాల పంటలు సాగు చేస్తారు.
సాగర్‌ జలాల రాకతో నీరు లేక బోసిపోయిన పలు చెరువులు ఇప్పుడు జలంతో కళకళలాడుతున్నాయి. దీంతో వారం రోజుల నుంచి ఆయకట్టులో వరినాట్లు పూర్తి చేయడంలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఇటీవల వరకు బీడు భూములను తలపించిన పొలాలు పచ్చగా కనువిందు చేస్తున్నాయి. చెరువులన్నీ నిండుగా నీరు చేరి తొణికసలాడుతుండటంతో వరిలో పొట్టదశ వరకు నీటి తడులు అందించవచ్చనే భరోసాను రైతులకు కల్పించింది. తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి ఎన్నెస్పీ అధికారులతో సమావేశమై, ముందస్తుగా చెరువులకు సాగర్‌ జలాలపై సమీక్షించడం మేలు చేసింది. గంపలగూడెం మండలంలోని ఊటుకూరు, గాదెవారిగూడెం, గుళ్లపూడి, మేడూరు, ఆర్లపాడు, లింగాల, సొబ్బాల, కొణిజెర్ల, పెనుగొలను, గంపలగూడెం, చినకొమిర, గోసవీడు గ్రామాల పరిధిలోని చెరువులకు సాగర్‌ జలాలు చేరాయి. తిరువూరు మండలంలోని మల్లెల, మునుకుళ్ల, అక్కపాలెం, కోకిలంపాడు, పెద్దవరం, ఎర్రమాడు, వావిలాల, తిరువూరు గ్రామాల పరిధిలోని చెరువులకు చేరిన సాగర్‌ జలంతో వరినాట్లు పూర్తి చేస్తున్నారు. రెండు మండలాల్లో చెరువుల ఆయకట్టులో సుమారు మూడు వేల ఎకరాల్లో వరిసాగుకు సాగర్‌జలంతో భరోసా లభించింది. నవంబరు నాటికి మరోసారి చెరువులకు సాగర్‌ నీరు అందిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట రైతు చేతికి వస్తుంది. ఎన్నెస్పీ రెండో జోన్‌ పరిధిలోని మధిర బ్రాంచి కెనాల్‌కు విడుదల చేసిన 
సాగర్‌ జలాలు మెట్టపంటలకు జీవం పోశాయి. జూన్‌లో కురిసే తొలకరి వర్షాల నురచి మెట్ట పంటలు సాగు ప్రారంభిస్తారు. పత్తి, మిరప సాగు ఆలస్యంగానే ప్రారంభమైంది. జులైలో పత్తి సాగు చేయగా ఆగస్టు రెండో పక్షంలో కాల్వలకు సాగర్‌ జలాలు విడుదలతో మిరప మొక్కలు నాటడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఎన్నెస్పీ రెండోజోన్‌ ఆయకట్టులో 25 వేల ఎకరాల వరకు మెట్ట, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. మిరప, పత్తి పంటలకు తరుచూ నీటి తడులు అందించాల్సి ఉంది.

Related Posts