అమృత్ పై అంతా నిర్లక్ష్యమే.. (పశ్చిమగోదావరి)
అమృత్ పథకం పనులు గతేడాది డిసెంబరు నుంచి మందకొడిగా సాగుతుండగా కొన్ని నెలలుగా ఏ మాత్రం ప్రగతి కనిపించడం లేదు. తాజాగా ఈ పనులపై సమగ్ర నివేదిక తయారు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో వాటిలో ఉన్న లోపాలు బహిర్గతమవుతాయని పలువురు పేర్కొంటున్నారు. నివేదిక అనంతరం సమయం తీసుకుంటే మరికొన్నేళ్లపాటు పట్టణాల్లో దాహార్తి తప్పదనే వాదన కూడా ఉంది. కొన్ని నెలలుగా రూ. కోట్ల విలువైన బిల్లులు మంజూరు కాకపోవడం కూడా పనులు వెనుకబడటానికి ఒక కారణం. అటల్ పట్టణ నవీకరణ పునర్నిర్మాణ కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నింటిపైనా సమగ్ర అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. 25 శాతం మించి చేపట్టిన పనుల్లో పురోగతి నాణ్యత, పనులతీరు తదితర అంశాలపై నివేదిక తయారు చేయనున్నారు. అమృత్ పథకంలో తొలివిడతలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ఎంపికయ్యాయి. రెండు విడతలుగా రూ. 221.34 కోట్లు కేటాయించారు. ప్రధానపైపుల అమరిక, ఇంటింటా కుళాయిల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. తొలి విడత పనులు పూర్తి చేసేందుకు గడువు 18 నెలలు గడువుంది.*●తొలి విడత పనుల కాల పరిమితి గతేడాది డిసెంబరుతోనే ముగిసింది.రెండోవిడత పనులు 2020 నాటికి పూర్తి చేయాల్సింది. భీమవరంలో అమృత్ తొలి విడతలో రూ.47 కోట్లు విడుదలయ్యాయి. హెడ్‌వాటర్ వర్క్స్ నుంచి బుధవారం మార్కెట్ వరకు ప్రధాన పైపులైను ఏర్పాటుకు రూ.8 కోట్లు.., పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పైపులైన్ల ఏర్పాటుకు రూ.20 కోట్లు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఏర్పాటుకు రూ.7 కోట్లు కేటాయించారు. రెండోవిడతలో రూ.52 కోట్లు కాగా వాటితో ఒకటో పట్టణ పరిధి నర్సయ్యఅగ్రహారం, రెండో పట్టణపరిధి దుర్గాపురం, రామలక్ష్మణ్‌నగర్‌లో ఒక్కొక్కటి చొప్పున మంచినీటి సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం, వేండ్రవెళ్లే
రహదారిలో ఉన్న 63 ఎకరాల విస్తీర్ణంలో చెరువు తవ్వకం చేయాలనుకున్నారు. తాడేరురోడ్డులోని 82 ఎకరాల పరిధిలో రెండెకరాల విస్తీర్ణంలో మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మించాలనుకున్నారు. ప్రధాన పైపులైను నిర్మాణ పనులే ఇప్పటికీ పూర్తికాలేదు. గతంలో పలు వార్డుల్లో ఇంటింటా కుళాయి నీరందించి ప్రయోగాత్మకంగా పరిశీలించినా ప్రస్తుతం గత విధానంలోనే నీటి సరఫరా కొనసాగుతోంది. పలు కూడళ్లలో ప్రధాన పైపులు వాహనాల చక్రాల కింద పడి మరమ్మతులకు గురవుతుండగా, మరికొన్నింటిని రాళ్లు, వ్యర్థాలతో నింపేస్తున్నారు. భీమవరం పట్టణంలో 184 కిలో మీటర్ల పొడవునా పైపులు అమర్చాల్సి ఉండగా ఇప్పటికి 130 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 18,500 ఇంటింటా కుళాయిలు ఉండగా అమృత్ చేరువవుతుందంటూ మరో రెండు వేల కనెక్షన్లు కేటాయించారు. అటు అమృత్ దరిచేరకపోగా, పైపుల్లోని నీరు లీకుల నుంచి వెళ్లకుండా అడ్డుకోలేక పోవడంతో తాగునీటి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.ఏలూరులో మొదటి విడతలో రూ.3 కోట్లు విడుదలయ్యయి. వాటితో పైపులైన్ల ఏర్పాటు, కుళాయి కనెక్షన్లు, పోస్టల్‌కాలనీలో పార్కు అభివృద్ధి చేయాలనుకున్నారు. రెండో విడతలో విడుదలైన నిధులు - రూ. 42.71 కోట్లు. మంచినీటి సరఫరా, మురికినీరు శుద్ధిచేసి విడుదల చేసేందుకు అవసరమైన ప్లాంటు నిర్మాణం చేయాలనుకున్నారు. ఏలూరులోని 1, 2 పట్టణాల పరిధిలో 3.5 కిలోమీటర్ల మేర పైపులు అమరుస్తున్నారు. పైపులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రహదారి మరమ్మతులు పూర్తి చేయలేదు. పైపుల అమరిక అసంపూర్తిగా ఉండటంతో పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.తాడేపల్లిగూడెంలో.. తొలి విడతలో రూ. 15.4 కోట్లు విడుదలవగా.., వాటితో 32వ వార్డులోని కడకట్లలో సర్వీసు రిజర్వాయర్ నిర్మాణం, హెడ్‌వాటర్ వర్క్స్ లో సంపు, కడకట్ల వరకు ప్రధాన పైపులైను ఏర్పాటు చేయాలి. రెండో విడతలో విడుదలైన రూ. 63.65 కోట్లతో మురికి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంటు, ఇంటింటా కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఈ పనులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. మంచినీటి ఓవర్‌హెడ్‌ట్యాంకు పనులు అసంపూర్తిగా మిగిలాయి. పైపులు అమర్చినా రహదారులకు మరమ్మతులు పూర్తి చేయలేదు.