అమాత్యుల్లో సగం మందే పాస్
విజయవాడ, సెప్టెంబర్ 12,
వైసీపీ మంత్రివర్గం జూన్ 8న ప్రమాణం చేసింది. ఇప్పటికి సరిగ్గా మూడు నెలల పాలన పూర్తి అయింది. అయితే పాలనాపరంగా చూసుకుంటే పాతిక మంది మంత్రుల్లో గట్టిగా నలుగురైదుగురు తప్ప మిగిలిన వారెవరూ పనితీరు బాగా కనబరచలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ వద్ద నివేదికలు ఉన్నాయి. గోదావరి జిల్లాలకు అత్యధికంగా మంత్రి పదవులు ఇస్తే ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్ప మిగిలిన వారు ఇప్పటికీ కొత్తగానే ఉంటున్నారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి తన వెంట ఉన్న ఆళ్ళ నానిని డిప్యూటీ సీఎం చేస్తే ఆయన సైతం సరిగ్గా ఉనికిని చాటుకోలేక పోతున్నారని అంటున్నారు. అనుభవం ఉన్న పినిశె విశ్వరూప్ ని మంత్రిగా చేసినా ఆయన ఉలుకూ పలుకూ లేదు, మరో మంత్రి తానేటి వనిత తీరు సైతం అలాగే ఉందని అంటున్నారు.ఇక ఉత్తరాంధ్రాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పించి మిగిలిన ముగ్గురూ మంత్రులుగా ఫెయిల్ అంటున్నాయి నివేదికలు. అలాగే గుంటూరులో హోం మంత్రి పనితీరు మెరుగుపరచుకోవల్సివుంది. కృష్ణా జిల్లాలో కొడాలి నాని మాటల్లో దూకుడు ఉన్నా పనితీరులో మాత్రం వెనకబడ్డారని అంటున్నారు. ఇక నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ సైతం మొదట్లో హడావిడి చేసినా ఇపుడెందుకో సైలెంట్ అయ్యారు. రాయలసీ\మలో ఉన్న మంత్రులు సైతం మౌన ముద్రలో ఉన్నారు. పనిచేసె మంత్రుల గురించి తీసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కనీపిస్తున్నారు. దీనికి కారణమేంటన్నది ఆరా తీస్తే చాలా మంది మంత్రులు లోలోపల రగిలిపోతున్నారని సమాచారం.పేరుకు మంత్రులు కానీ తమకు ఎక్కడా స్వేచ్చ లేనే లేదని వైసీపీ అమాత్యులు గగ్గోలు పెడుతున్నారు. అంతా అధికారులదే రాజ్యమైపోయిందని కూడా అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే అన్నీ చూస్తున్నారని, కనీసం తమ మాట వినడం లేదని వాపోతున్నారు. జగన్ ఇచ్చిన స్వేచ్చతో అధికారులు పాలనలో అతి జోక్యం చేసుకుంటున్నారని, దాంతో తాము డమ్మీలుగా మారిపోతున్నామని అంటున్నారు. వీటికి తోడు అన్నట్లుగా వారందరినీ నియమించింది ముఖ్యమంత్రి జగన్. దాంతో వారికి అసలు బాస్ ఎవరో తెలిసిపోయిందని, అందువల్ల మంత్రులను అసలు ఖాతరు చేయడంలేదని అంటున్నారు. జగన్ సైతం అధికారులతో ప్రతీ రోజూ సమీక్షలు జరుపుతూ వారినే ముందుండి నడిపిస్తున్నారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మంత్రులు బయటకు చెప్పలేక, మింగలేక అన్నట్లుగా ఉంటున్నారుట. మరి ఈ విధంగా ఉంటే జగన్ దృష్టిలో పనిచేయని మంత్రులుగా ఉంటారన్నది తెలిసినా కొంతమంది ఏ రకమైన అధికారం లేని మంత్రి పదవి ఎందుకన్న వైరాగ్యం కూడా ప్రదర్శిస్తున్నారుట. మొత్తానికి వైసీపీ మంత్రుల అసంత్రుప్తి దావానలంగా మారకముందే హై కమాండ్ తక్షణ చర్యలు చేపట్టాల్సివుంది.