గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనా
విశాఖపట్టణం, సెప్టెంబర్ 12,
శాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం అలా ఇలా ఉండదుగా. కాదన్న వారితోనే అవును అనిపించుకోవడం ఆయనకే చెల్లు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అక్ధరాభ్యాసం చేసిన గంటా తరువాత చిరంజీవి ప్రజారాజ్యానికి తానొక సారధిగా నిలిచారు. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం ద్వారా వచ్చిన రాజకీయ లాభాన్ని పంచుకుని తొలిసారి మంత్రి అయిపోయారు. ఆ తరువాత విభజన దెబ్బకు హస్తం కుదేలైపోతే మళ్ళీ చంద్రబాబు పంచన చేరి మంత్రి అయిపోయి అయిదేళ్ళ పాటు పదవిని అనుభవించారు. ఇపుడు గంటా శ్రీనివాసరావున ప్రతిపక్షంలో క్షణం కూడా ఉండలేకపోతున్నారట. వైసీపీకి కన్నుగీటుతూ తాజాగా ముఖ్యమంత్రి జగన్ కి ప్రేమలేఖ రాసేంతవరకూ కధ నడిపారు. ఇపుడు ఆ ప్రేమ లేఖకు జగన్ ఫిదా అయ్యారని వైసీపీ వర్గాలా భోగట్టా.గంటా శ్రీనివాసరావు వైసీపీకి కొత్త కాదు, ఆయన 2014 ఎన్నికలకు ముందే వైసీపీ తలుపులు తట్టారు, నాడు జగన్ సైతం సరేనని అన్నారు. కానీ తనతో పాటు అరడజను మంది జనానికి ఎమ్మెల్యే టికెట్లు ఇమ్మని గంటా శ్రీనివాసరావు కోరారని, దానికి జగన్ ససేమిరా అన్నారని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక 2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని గంటా శ్రీనివాసరావు భావించి చేరేందుకు ప్రయత్నించినా అంతకు ముందే అవంతి శ్రీనివాస్ చేరిపోయి ఆయన వ్యూహానికి గండి కొట్టారు. గత చరిత్ర ఎలా ఉన్నా ఈసారి మాత్రం గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు తాజాగా ముఖ్యమంత్రికి సంధించిన లేఖాస్త్రంలో విశాఖ భూదందాలో తన ప్రమేయం ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. అవసరమైతే మరో సిట్ ని కూడా ఏర్పాటు చేయమన్నారు. దీంతో జగన్ కూడా సంతృప్తి చెందారని, గంటా శ్రీనివాసరావు వంటి వారు కోరి పార్టీలోకి వస్తామంటే వద్దు అనడం రాజకీయ తప్పిదమే అవుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. పైగా గంటా శ్రీనివాసరావుని తాము కాదనుకుంటే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని, ఆ విధంగా ఆయన బలమైన ప్రత్యర్ధిగా భవిష్యత్తులో మారుతారని వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో గంటా శ్రీనివాసరావుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న ప్రచారం గట్టిగా సాగుతోంది.గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరాలంటే ఆయనకు ఇపుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అదే జరిగితే గంటా శ్రీనివాసరావు ఏమీ కాకుండా పోతారు. దాంతో వైసీపీ హై కమాండ్ గంటా శ్రీనివాసరావుకు అభయహస్తం ఇస్తోందట. వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్య సభ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీకే వస్తాయి. అందులో ఒకటి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చేందుకు ప్రతిపాదించారట. గంటా శ్రీనివాసరావుకు అనేక రకాల వ్యాపారాలు ఉన్నందున ఆయన్ని ఢిల్లీకి పంపితేనే బాగుంటుందని అనుకుంటున్నారుట. ఇక గంటా శ్రీనివాసరావు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఇబ్బంది లేకుండా గంటా శ్రీనివాసరావును ఢిల్లీకి పరిమితం చేయడం ద్వారా ఇద్దరు శ్రీనివాసులను ఒకే పార్టీలో ఉంచాలని వైసీపీ స్కెచ్ వేస్తోంది. గంటా శ్రీనివాసరావు కూడా రాజ్యసభ సీటు అంటే కచ్చితంగా మొగ్గు చూపుతారని అంటున్నారు. ఇలా గంటా శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకుని రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భారీ ప్లాన్ వేస్తోందని అంటున్నారు. చూడాలి మరి గంటా శ్రీనివాసరావు చేరికకు ముహూర్తం ఎపుడో.