టీ బీజేపీ బాస్ కోసం కసరత్తులు
హైద్రాబాద్, సెప్టెంబర్ 12,
ఒకప్పుడు తెలంగాణలో బీజేపీకి అంతగా పట్టు లేని మాట వాస్తవం. అసలు తెలంగాణ గడ్డపై కమలం వికసిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవడంతో ఆ పార్టీకి కొత్త జోష్ వచ్చింది.పార్టీలో చేరికలు పెరిగాయి.. టీఆర్ఎస్‌లో తమకు సముచిత గౌరవం దక్కలేదని భావించిన నేతలు సైతం కమలం గూటికే చేరిపోయారు.ఒకరకంగా కాంగ్రెస్ కంటే బీజేపీయే వేగంగా బలపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ బలోపేతంపహైకమాండ్ మరింత దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలా..?
లేక కొనసాగించాలా..? అనే ఆలోచనలో ఉందిప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మరోసారి తనకే బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్‌ను కోరుతున్నారు. తన వల్లే పార్టీ తెలంగాణలో ఇంతగా బలపడిందని పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. అమిత్ షా లక్ష్మణ్‌కే అవకాశం ఇస్తారని ఆయన సన్నిహితులు కూడా ధీమాగా చెబుతున్నారు.అయితే ఆర్ఎస్ఎస్ నాయకత్వం మాత్రం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరును అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.యువతలో సంజయ్‌కి ఉన్న పేరు.. దూకుడుగా వ్యవహరించే తీరు పార్టీకి కలిసొస్తాయని సంఘ్ భావిస్తోంది. అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్రమంత్రి పదవి లేదా అధ్యక్ష పదవిల్లో ఏది ఇచ్చిన తనకుఓకె అని అరవింద్ హైకమాండ్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి చేరిన నేతలు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు.ఇందులో డీకే అరుణ,జితేందర్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు.జితేందర్ రెడ్డికి గతంలో నుంచే బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కూడా కావడంతో ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక మహిళల కోటాలో డీకే అరుణ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉంటుందా? లేదా? అన్న దానిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కన్నాకు అధ్యక్ష పదవి దక్కినట్టే ఇక్కడ కూడా ఆ అవకాశం ఉండవచ్చునన్నది కొందరి వాదన. ఇదిలా ఉంటే,బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక డిసెంబర్‌లో జరగనుంది. ఈలోగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులను నియమించాలని పార్టీ భావిస్తోంది.చూడాలి మరి.. తెలంగాణలో గులాబీ దండును ఢీకొట్టడానికి కమల సేనాధిపతిగా హైకమాండ్‌ను ఎవరిని నియమిస్తుందో..