అనంతలో దూకుడు కొనసాగిస్తున్న గోరంట్ల
అనంతపురం, సెప్టెంబర్ 12,
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన ఫైర్ బ్రాండ్ పోలీస్. నోరు విప్పితే సంచలనం. తనకు తానే బాస్‌గా ఆయన చెలరేగిపోయారు. విషయం చిన్నదైనా.. పెద్దదైనా.. కూడా ఆయన సంచలనాలకు వేదికగానే మారారు. ఈ క్రమంలోనే ఆత్మానంద మఠం విషయంలో అనంతపురం అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో వివాదానికి దిగారు. పోలీసులను పరుషంగా
వ్యాఖ్యానించడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఎవరినైనా సరే.. నాలుక కోస్తా అంటూ మీసం మెలేశాడు. దీంతో చాన్నాళ్లు ఆయన మీడియాలో ఉన్నారు. ఆయనే గోరంట్ల మాధవ్.కురబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకు కదిరి సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీగా పోటీకి దిగారు. అయితే, ఆయన నామినేషన్ విషయం తీవ్ర వివాదం అయింది. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నిమ్మల కిష్టప్పపై లక్ష ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో గోరంట్ల మాధవ్ ఘనవిజయం సాధించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. సీఐగా గతంలో ఉన్న దూకుడును ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. బహిరంగ సభల్లోనూ తన దూకుడు ఎక్కడా తగ్గించలేదు.ఇక, స్థానిక సమస్యలపై దృష్టి సారించడంలో ముందున్నారని చెప్పాలి. ముఖ్యంగా యువతకు ఉపయోగ కరమైన పనులు చేపట్టేందుకు గోరంట్ల మాధవ్ ప్రాధన్యమిస్తున్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లడంలోనూ ఆయన కీలకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. జగన్ సూచనలు, సలహాలను తూచ తప్పకుండా అమలు చేస్తూ గోరంట్ల మాధవ్ ముందుకు సాగుతున్నారు. జగన్ ప్రధానంగా ఆశ పెట్టుకున్న ప్రత్యేక హోదా విషయంలో పట్టు వీడేది లేదని పదే పదే ఉద్ఘాటిస్తున్నారు.యువకుడు,
ఉత్సాహ వంతుడు కావడంతో పార్టీలోనూ ప్రధానంగా గుర్తింపు సాధించారు గోరంట్ల మాధవ్. అందరినీ సార్.. అని సంబోధిస్తూ.. కలివిడిగా ఉండడంతోపాటు అవినీతి తావులేని విధంగా ముందుకు సాగుతున్నారు. అదే టైంలో ఎంపీ అయినా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం మాత్రం మానడం లేదన్న విమర్శలు కూడా గోరంట్ల మాధవ్‌పై ఉన్నాయి. కియా కారు ప్రారంభోత్సవం రోజున గోరంట్ల మాధవ్ కియా మేనేజ్‌మెంట్ మెడలు వంచుతా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ఏదేమైనా ఈ మాజీ పోలీస్ ఎంపీ గోరంట్ల మాధవ్ అదే దూకుడు రాజకీయాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు.