ట్రిపుల్ కే ఫార్ములాపై చర్చోపచర్చలు
ఖమ్మం, సెప్టెంబర్ 12,
తెలంగాణ మంత్రి వర్గంలో సీటు సంపాయించుకున్న పువ్వాడ అజయ్ కుమార్ చుట్టూ ఆసక్తికర వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో భుజం భుజం రాసుకుని ముందుకు నడిచిన నాయకులను, ఇంకేముంది.. కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడని భజన చేసిన భట్రాజులను కూడా విడిచి పెట్టి.. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి, పార్టీలో చేరిన పువ్వాడ అజయ్ కు మంత్రి వర్గంలో సీటు లభించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా వుంటే, టీఆర్ఎస్ పార్టీలోని నాయకులు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు.అయితే, తాజాగా పువ్వాడ అజయ్ నోటి నుంచే ఆసక్తికర విషయం వెలుగు చూసింది. తనకు ట్రిపుల్ ‘ కె ‘ ఫార్ములా అచ్చొచ్చిందని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. టీఆర్ఎస్ నేతల్లో కేటీఆర్ కూటమిగా ఉన్న కొందరు నాయకులు ఈ విషయంపై నేరుగా పువ్వాడనే ఆటపట్టించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. కొత్తగా మంత్రి పదవిని సొంతం చేసుకున్న పువ్వాడ అజయ్ కుమార్.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఆ వెంటనే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా సాగితే.. తాను మాత్రం తక్కువ తినలేదన్నట్లు పువ్వాడ కూడా పంచ్ లు వేయటం విశేషం.పువ్వాడ అజయ్ తో సుమన్ మాట్లాడుతూ.. మొత్తానికి కేటీఆర్ చెవులు కొరికి మంత్రి పదవి కొట్టుకుపోయావ్ అని సరదాగా వ్యాఖ్యానిస్తే.. ఈ కామెంట్‌కు పువ్వాడ నవ్వుతూనే.. చమక్కులు పేల్చారు. మీరే స్టార్స్ .. మమ్మల్ని రానిస్తారా ? కేటీఆర్‌కు అడ్డంగా మీరే నిలబడతారుగా ? 24 గంటలూ కేటీఆర్ దగ్గరే ఉంటారు.. అక్కడే ఉండీ ఉండీ నువ్వూ ఓ పదవి కొట్టేశావ్ అని పువ్వాడ అజయ్ బదులిచ్చారు. అంతే కాదు.. తనకు కేకేకే కోటాలో మంత్రి పదవి వచ్చిందన్నారు. ఖమ్మం.. కమ్మ.. కేటీఆర్ అంటూ ట్రిపుల్ ‘ కే ‘ ఫార్ములాను పువ్వాడ ముడివిప్పారు.అంతేకాదు, తన తండ్రి నాగేశ్వరరావు కాలం నుంచి ఎంతో కష్టపడితే.. ఇన్నాళ్లకు మంత్రిపదవి వచ్చిందని.. నీ కళ్లు నా మీద పడనివ్వకు.. అని పువ్వాడ అజయ్ చురకలంటించారు. అయితే, పువ్వాడ అజయ్ ను కూడా సుమన్ బాగానే
వాడేసుకున్నారు. ఒక రైజింగ్ స్టార్ (పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి).. ఒక సీనియర్ స్టార్ (తుమ్మల నాగేశ్వర్ రావు) ను పక్కకు తప్పించేశావ్‌గా అని రియాక్ట్ అయ్యారు. మొత్తానికి వీరిద్దరి సంభాషణ ఆసక్తిగాను ఆలోచనాత్మకంగా సాగడం గమనార్హం. ఏదేమైనా.. ఉత్తర, దక్షిణాలు కేవలం సాధారణ ఉద్యోగాలకే కాదు.. రాజకీయ పదవులకు కూడా చాలా అవసరమనే విషయం స్పష్టమవుతోంది.