ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్
చెన్నై, సెప్టెంబర్ 13,
ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశ వారికి లేదు. అలాగని పార్టీని గెలిపించుకునే సత్తా కూడా లేదు. వారిద్దరి లక్ష్యం ఒక్కటే. అధికారంలో ఉన్న నాలుగురోజులు పెత్తనం చెలాయించడమే. ఇదీ తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకేలోని అగ్రనేతలు పన్నీర్ సెల్వం, పళనిస్వామిల తీరు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీ సజావుగా
నడుస్తుందని భావించారు. అందుకే ఢిల్లీలోని బీజేపీ పెద్దలుఇద్దరికీ రాజీ కుదిర్చి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. అయినా వీరు ఆధిపత్యం కోసం పోరు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే చతికల పడింది. ఘోరంగా విఫలమయింది. ప్రతిపక్ష డీఎంకే సత్తా చాటింది. ఈ ఎన్నికల ఫలితాలే పన్నీర్, పళనిస్వామిల సత్తాను చాటి చెప్పాయి. అయినా వీరిలో ఏమాత్రం మార్పు రాలేదు. పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలని పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారు. అది కుదరదని పళనిస్వామి వర్గం తేల్చి చెబుతోంది. తాడో పేడో తేల్చుకునేందుకు తాను సిద్ధమేనని పార్టీ సన్నిహితుల వద్ద పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించడం మచ్చుకు ఉదాహరణ.ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల పదిరోజుల పాటు విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు కూడా పన్నీర్ సెల్వం వెళ్లలేదు. ఇది ఒక్కటి చాలు వారి మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలియడానికి. పన్నీర్ సెల్వం తనను ముఖ్యమంత్రి నమ్మడం లేదని బలంగా భావిస్తున్నారు. తనకు ఏ బాధ్యతలను అప్పగించకుండా కొందరు మంత్రులకు పని విభజన చేసి పళనిస్వామి విదేశాలకు వెళ్లడాన్ని పన్నీర్ సెల్వం జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియాలో విభేదాలంటూ హోరెత్తడంతో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి పలకరించి వచ్చారు.మరో ముఖ్యమైన విషయమేంటంటే పన్నీర్ సెల్వానికి ఒక బలమైన అనుమానం ఉందట. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు పళనిస్వామి సరెండర్ అవుతారని పార్టీలో పన్నీర్ సెల్వం పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పటికే కొందరు పళనిస్వామి వర్గానికి చెందిన మంత్రులు శశికళ రాకను స్వాగతిస్తూ ప్రకటన చేయడం ఈసందర్భంగా పన్నీర్ సెల్వం వర్గం గుర్తు చేస్తోంది.
పళనిస్వామి శశికళకు తిరిగి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని పన్నీర్ సెల్వం చేస్తున్న ప్రచారాన్ని ఆయన వర్గం ఖండిస్తోంది. మొత్తం మీద అన్నాడీఎంకేలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నది వాస్తవం. మరి ఎన్నికల నాటికి ఈ పార్టీ ఉంటుందా? మళ్లీ చీలుతుందా? అనేది చూడాల్సి ఉంది.