అమరావతి శాపగ్రస్థ రాజధానా....
విజయవాడ, సెప్టెంబర్ 13,
అమరావతి అంటే అలాంటి ఇలాంటి పేరు కాదు, ప్రాచీనమైన రాజధానిగా చెబుతారు. ఇప్పటికీ గుంటూరు జిల్లాలో అమరేశ్వరుడు, అమరావతి అన్నవి వేరేగా ఉన్నాయి కూడా. ఇక తెలుగు ప్రజలందరికీ ప్రాచుర్యంలోకి వచ్చిన అమరావతి కధని వినిపించినది అచ్చంగా చంద్రబాబే. మొదటి ఏడాదంతా చంద్రబాబు హైదారాబాద్ లోనే ఉంటూ పాలన చేసినా కూడా తరువాత కాలంలో చంద్రబాబు విజయవాడలో స్థిరపడి అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ, గుంటూరు జిల్లాల మంధ్య అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలని బాబు ఆలోచించారు. ఇక అటు రాయలసీమకు, ఇటు ఉత్తరాంధ్రకు అందుబాటులో అమరావతి రాజధాని ఉందని, అందరికీ దగ్గరదారిగా ఉంటుందని కూడా బాబు భావించి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారంటారు. రాజధాని ఎంపిక మీద విమర్శలు పక్కన పెడితే ఇపుడు అమరావతి రాజధాని శాపగ్రస్థ అంటున్నారు. అక్కడ ఉంటే అభివృధ్ధి సాధ్యం కాదని కూడా అనేస్తున్నారు. మరి దానికి గల ఆధారాలేంటో…?అమరావతి రాజధాని
విషయంలో జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అంటున్నారు. అమరావతి అచ్చిరాదని కూడా ఆయన ముఖం మీదే చెప్పేస్తున్నారు. అమరావతిలో కూర్చుని పాలన చేస్తే జగన్ ఎప్పటికీ విజయం సాధించలేరని కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. చింతా మోహన్ కాంగ్రెస్ నాయకుడు, పైగా రాయలసీమకు చెందినవారు, అందువల్ల ఆయన అలాగే మాట్లాడుతారని అనుకోవచ్చు. కానీ ఆయన మరో పెద్ద పదమే వాడారు, అమరావతి శాపగ్రస్థ అనేశారు. అక్కడ ఉంటే అభివృధ్ధి అసాధ్యమని కూడా చెప్పేశారు. జగన్ వెంటనే అమరావతి విడిచిపెట్టి తిరుపతిని రాజధానిగా ప్రకటించి పాలన చేయాలని కూడా ఆయన కోరారు. ఇది ఎంతవరకూ తర్కానికి నిలబడుతుందన్న ఆలోచన కాసేపు పక్కన పెడితే అమరావతి రాజధాని అని చెప్పిన చంద్రబాబు రాజకీయంగా ఏం బావుకున్నారన్న ప్రశ్నలు వెంటనే ఉత్పన్నం అవుతాయి. అదే విధంగా బంపర్ మెజారిటీతో గద్దెనెక్కిన జగన్ వంద రోజులు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా స్థిమితపడకపోవడం పాలన మీద ఆదిలోనే విమర్శలు చెలరేగడాన్ని బట్టి చూస్తే చింతా మోహన్ మాటలు కొంతవరకేనా ఆలోచింపచేసేవేనని అంగీకరించాలేమో.అమరావతి రాజధాని పేరు చెప్పుకుని కధ నడిపిన తరువాత అటు పాలకులు, ఇటు పాలితులు కూడా సుఖపడిన దాఖలాలు లేవు అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తెగేసి చెప్పేశారు. ప్రత్యేక ప్యాకేజి కూడా లేకుండా పోయింది. అమరావతి ఏర్పడ్డాక వరసగా ఇప్పటికి నాలుగు కేంద్ర బడ్జెట్లు వస్తే వేటిలోనూ వీసమెత్తు సాయం కూడా ఏపీకి లేకుండా పోయింది. పోలవరం ఎన్నో అగచాట్లు పడుతూ లేస్తూ ఉంది. ఏపీలో అభివృధ్ధి పెద్దగా కనిపించడంలేదు. పోనీ చంద్రబాబు వల్ల ఇలా జరిగిందని అనుకుని జగన్ ని అధికార పీఠం మీద కూర్చోబెట్టినా ఆయన్ని కూడా సరిగ్గా పనిచేయనీయని పరిస్థితులు
ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నపుడు వాస్తుపరంగా అమరావతి కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న వాస్తు నిపుణుల మాటలు గుర్తుకువస్తున్నాయి. అమరావతిలో పచ్చని పొలాలను బీడు చేసి భవనాలు కట్టాలనుకోవడం తప్పు అన్న పర్యావరణవేత్తల హిత వచనాలు గుర్తుకువస్తున్నాయి. అంతే కాదు, అమరావతి ప్రదేశం ముంపు ప్రాంతమని, పైగా వరదలు, భూకంపాల జోన్ అని చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కూడా స్పురణకు వస్తోంది. మొత్తానికి చూసుకుంటే అమరావతి శాపగ్రస్థ అని చెప్పలేకపోయినా ఏవో అడ్డంకులు మాత్రం అభివృధ్ధికి అడ్డుపడుతున్నాయని అంతా భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా వాస్తు దోషాలను గమనించి తగిన చర్యలు తీసుకుంటే అమరావతికి, ఆంధ్ర జనానికి, పాలకులకూ మంచిదేమోనని కూడా మేధావులు సూచిస్తున్నారు