ఉచిత విద్యుత్ కు ప్రాధాన్యత
అమరావతి, సెప్టెంబర్ 13
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించుటకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతాంగానికి ఆదాయ వనరులను పెంపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర విద్యుత్, అడవులు, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయం లోని బ్లాక్ 2 లో ఉన్న సమావేశ మందిరంలో ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రీతిపాత్రమైన పథకమని, దాని అమలుకు అధికారులందరూ శాయశక్తులా కృషిచేసి ఆంధ్రప్రదేశ్ ను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయినందున ఉచిత విద్యుత్ పథకం అమలు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల మరియు రైతుల ఆదాయ వనరుల పెంపుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగం 60 శాతం ఉచిత విద్యుత్ పైనే ఆధారపడి పనిచేస్తుందన్నారు. ఇంకా పూర్తిచేయవలసిన వ్యవసాయ ఆధారిత ఫీడర్లను మార్చి 2020 నాటికి పూర్తి చేయాల్సిందిగా ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రం మొత్తం మీద 18.5 లక్షల కుటుంబాలు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా లబ్ధి చేకూరుతున్నదని ఆయన వెల్లడించారు. శ్రీకాకుళంలోని గార మండలం, గుంటూరులోని పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని ఎత్తైన ప్రాంతం మరియు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, తక్షణమే దానిపై నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత డిస్కం చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ని ఆదేశించారు. ఈ విషయమై సత్వర చర్యలు తీసుకొని ప్రజలనుండి ఎటువంటి ఫిర్యాదులు అందకుండా చూడాలని ఫిర్యాదులు అందినట్లైతే తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సమృద్ధిగా నీటి లభ్యత ఉన్నందున ఖరీఫ్ సీజన్ లో విద్యుత్ వినియోగం 185 మి.యూనిట్ల నుండి 190 మి.యూనిట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నందున తదనుగుణంగా విద్యుత్ అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
రైతులు ఈ విషయమై ప్రభుత్వంపై భారీ అంచనాలతో ఉన్నారని అదే విధంగా ప్రతి గృహ వినియోగదారుడు నిరంతర విద్యుత్ పొందేలా చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా మరియు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించే విధంగా సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సెక్రటరీ, ట్రాన్స్ కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, ట్రాన్స్ కో ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా 4100కేవీ, 132 కేవీ మరియు 220 కేవీ సబ్ స్టేషన్లతో పాటు మరమ్మతులు, నిర్వహణకై 2019-20కి సంబంధించి రూ.1463 కోట్లు, 2020-21 కి సంబంధించి రూ.2603 కోట్లు, 2021-22 కి సంబంధించి రూ.2791 కోట్లు 2022-23కి సంబంధించి రూ.2140 కోట్లు మరియు 2023-24 కు సంబంధించి రూ.1705 కోట్లతో ప్రణాళికలు రూపొందించడం జరిగిందని మంత్రికి వివరించారు. అదే విధంగా ఏపీ ట్రాన్స్ కో ద్వారా 32 కేవీ సబ్ స్టేషన్లు 110, 220కేవీ సబ్ స్టేషన్లు 135, 400 కేవీ సబ్ స్టేషన్లు 10 ఏర్పాటుకు రానున్న 5 సంవత్సరాలకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. భవిష్యత్ లో సదరు పనులు పూర్తి ద్వారా లోవోల్టేజీ సమస్య రాష్ట్రంలో ఎక్కడా ఉత్పన్నం కాదని ఆయన తెలిపారు. భవిష్యత్ లో రానున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ – V (800 మెగావాట్లు) మరియు కృష్ణపట్నం వద్ద శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (800 మెగావాట్లు) నిర్మాణాలను 2019-20 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, పోలవరం హైడల్ థర్మల్ ప్రాజెక్టు (12x80మెగావాట్లు) 2021-22 నాటికి పూర్తి చేయడంతో పాటు ఎగువ సీలేరు (9x150 మెగావాట్లు) యూనిట్ ను 2024-25 నాటికి పూర్తి చేసే విధంగా మరియు దిగువ సీలేరు (2x115 మెగావాట్లు) యూనిట్ ను 2022-23 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు చేపట్టడం జరిగిందని, అదే విధంగా సోలార్ విద్యుత్ రామగిరి ప్రాజెక్టు 10 మెగావాట్లు ఏర్పాటుపై విచారణ చేపట్టడం జరుగుతున్నదని ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్ కో జాయింట్ ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు శాంతి శేషు మరియు సంబంధిత శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.