మానాజీపేట కు గణపురం బ్రాంచ్ కెనాల్ నీరు
వనపర్తి సెప్టెంబర్ 13
వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి గణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మానాజీ పేటకు సాగునీటిని అందించి తీరుతానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం మానాజీపేటలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అంతేకాక ఒక్కొక్కటి ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రెండు అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు వల్ల మానాజీ పేట ప్రాంతంలో విద్యుత్ సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ట్రాన్స్కో అధికారులు రానున్న 60, 70 రోజుల్లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా సాగునీరు, విద్యుత్ అందించే చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో యూరియా సమస్య
ఏర్పడిన వెంటనే గడిచిన రెండు రోజుల నుండి నాలుగైదు జిల్లాలు తిరగడంతో పాటు స్వయంగా విశాఖపట్టణం వెళ్లి ఓడరేవు వద్ద హమాలీల తో మాట్లాడి మూడు షిఫ్టు లలో పని చేయించి యూరియాను త్వరితగతిన రాష్ట్రానికి తీసుకు రావడం జరిగిందని వెల్లడించారు.