YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 ప్రజాప్రతినిధులకు హరితహారం టార్గెట్..

 ప్రజాప్రతినిధులకు హరితహారం టార్గెట్..

 ప్రజాప్రతినిధులకు హరితహారం టార్గెట్...
నిజామాబాద్, సెప్టెంబర్ 14, (న్యూస్ పల్స్)
హరితహార కార్యక్రమం ప్రజాప్రతినిధులకు పెద్ద పరీక్షగా మారింది.. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటించడం వారికి తలనొప్పిగా పరిణమించింది.. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కాకపోవడంతో గ్రామ పంచాయతీలపైనే భారం పడింది.. దీంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం తమకు తలకు మించిన భారంగా మారిందని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది వాపోతున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు బాధ్యత తీసుకునేవి. దీంతో ప్రతి విడతలో జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటించారు. అయితే, ఇప్పుడు కొనసాగుతున్న ఐదో విడతలో జిల్లాలో 2.10 కోట్ల మొక్కలను నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 30లక్షల మొక్కలను మాత్రమే నాటించారు. మరో 1.80 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భారమంతా పంచాయతీ పాలకవర్గంపైనే పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్న గ్రామాలు తక్కువగా ఉన్నాయి. మిగిలిన గ్రామాలు విస్తీర్ణం పరంగా చాలా చిన్నవి. అయితే అన్ని గ్రామ పంచాయతీలకు ఒకే విధమైన లక్ష్యాన్ని నిర్దేశించడంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద గ్రామాలు తేడా లేకుండా 40 వేల మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ఈ లెక్కన మొక్కలను నాటితే గ్రామ పంచాయతీల 
పరిధిలో కోటిన్నర మొక్కలు నాటే అవకాశం ఉంది. మిగిలిన మొక్కలను మున్సిపాలిటీలు, మరికొన్ని అటవీ శాఖ భూముల్లో నాటించాలి. చిన్న గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ భూమి తక్కువగానే ఉండటంతో 40 వేల చొప్పున మొక్కలను నాటడం సాధ్యం కావడం లేదు.కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు మొక్కలను సంరక్షించే బాధ్యత సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బందిపై ఉంది. కానీ, విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట నిర్ధేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటడమే ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది వర్షాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో మొక్కలు నాటడం సాధ్యం కావడం లేదు. హరితహారం కార్యక్రమం తొలి నాలుగు విడతల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాన్ని నిర్ణయించి ఆ మేరకు మొక్కలు నాటించారు. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్, నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖ, పంచాయతీరాజ్, 
గ్రామీణాభివృద్ధి, రవాణా తదితర శాఖలకు మొక్కలను నాటించే బాధ్యతను అప్పగించారు. వ్యవసాయ శాఖ ద్వారా పొలం గట్లు, వ్యవసాయ క్షేత్రాలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల శిఖం భూముల్లో మొక్కలు నాటించారు.ఇలా అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో భాగస్వాములను చేయడంతో నిర్ధేశిత లక్ష్యం పూర్తయ్యింది. కానీ ఇప్పుడు పంచాయతీలపైనే భారం మోపడంతో ఆ మొక్కలను ఎలా నాటించాలో అర్థం కావడం లేదని సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీలలో సిబ్బంది తక్కువగా ఉండటంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.

Related Posts