సిటీలో 21 మురుగునీటి శుద్ధి కేంద్రాలు : కేటీఆర్
హైద్రాబాద్, సెప్టెంబర్ 14,
జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో మురుగునీటి శుద్ధి కేంద్రాల సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చెత్త సేకరణ, మురుగునీటి శుద్ధీకరణ మెరుగ్గా ఉంది. ఢిల్లీ, ముంబయి నగరాల కంటే మనం మెరుగ్గా ఉన్నాం. మరింత మెరుగ్గా పని చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కోసం 21 ప్లాంట్లు పని చేస్తున్నాయని తెలిపారు. 2021 వరకు వీటిని రెట్టింపు చేస్తాం. హైదరాబాద్ 54 శాతం డ్రైనేజీ నీరు మూసీ నదిలో కలుస్తోంది. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.