
ముగ్గురిని బలిగొన్న అతివేగం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 14,
త్వరగా గమ్యం చేరాలన్న ఆత్రుత ముగ్గురిని బలితీసుకుంది. నిద్ర ముంచుకొస్తున్నా డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు పోవడమే వారి పాలిట శాపమైంది. ట్రాలీ ఆటో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆ విషాద సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద 16 వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మరో ముగ్గురు గాయపడ్డారు.శ్రీకాకుళం జిల్లా శింగవలస గ్రామానికి చెందిన కురిటి అప్పన్న గుంటూరు సమీపంలోని గొర్రెల మండిలో గొర్రెలు కొనేందుకు తన మిత్రులు మూలాల శ్రీను, చింతలోల సింహాచలం, గోరా కన్నయ్య, కోటిపల్లి శాంతారావులతో ట్రక్కు ఆటోలో బయలుదేరాడు. ట్రక్కు డ్రైవర్ మార్గం మధ్యలో మరో ప్రయాణికుడిని ఎక్కించుకున్నాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంగళగిరి సమీపానికి చేరుకునే సరికి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్‌ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కోటిపల్లి శాంతారావు (22) గోరా కన్నయ్య(28)లు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మధ్యలో వాహనం ఎక్కిన గుర్తు తెలియని యువకుడికి గాయాలవడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. వాహనంలో ఉన్న మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.