పీపీఏలను రద్దు చేయం : కోర్టుకు సర్కార్ పిటీషన్
విజయవాడ, సెప్టెంబర్ 14,
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షకు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవో నెంబరు 63ను సవాల్ చేస్తూ ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని, విద్యుత్ సంస్థలకు ఏపీఎస్‌పీడీసీఎల్ రాసిన లేఖలనూ నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. తాజాగా, ఈ పిటిషన్లపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ముందు శుక్రవారం మరోసారి విచారణ సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పీపీఏలపై పునఃసమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమించడం తప్పుకాదని వాదనలు వినిపించారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా వాటిని సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.విద్యుత్తు ఉత్పత్తి సంస్థలను సంప్రదింపులకు పిలవకుండా తాము ఏపీఈఆర్‌సీని ఆశ్రయిస్తే ఏకపక్షమవుతుందని అన్నారు. అందుకే సంప్రదింపులకు రావాలని ఆయా సంస్థలను కోరినట్టు వివరించారు. విద్యుత్తు చట్టాల నిబంధనల్లోనూ సంప్రదింపులకు ఆహ్వానించడంపై నిషేధం లేదని తెలిపారు. ఆయా సంస్థలు ఆందోళన చెందుతున్నట్లుగా ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా పీపీఏలను రద్దు చేసే పరిస్థితి ఉండబోదని, ఈఆర్‌సీని ఆశ్రయించే అవకాశం వారికి ఉందని వివరించారు. అయితే, జీవోను సవాలు చేస్తూ ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని ఏజీ అభ్యర్థించారు.పీపీఏలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తే వాస్తవాలు అవగతమవుతాయని తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. ఈ వాదన అనంతరం పిటిషనర్ల వాదనలు వినిపించడానికి విచారణను సెప్టెంబరు 18కి న్యాయమూర్తి వాయిదా వేశారు. కాగా, యూనిట్ ఛార్జీలను తగ్గించి బకాయి బిల్లు వివరాలు అందించాలని విద్యుత్ సంస్థలను ఏపీఎస్‌పీడీసీఎల్ కోరింది. టారిఫ్ ధరలు నచ్చకపోతే సంప్రదింపుల కమిటీ వద్ద తమ వైఖరి చెప్పాలని.. లేకపోతే పీపీఏలు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు విద్యుత్ సంస్థలు ఆరోపించాయి.