జగన్ వంద రోజుల ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
విజయవాడ, సెప్టెంబర్ 14,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. శనివారం ఉదయం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నివేదికను విడుదలచేశారు. మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను పవన్ వెల్లడించారు. ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్ఆర్సీపీ సర్కారు విఫలమైందని ఆరోపించారు. పోలవరం, ప్రజారోగ్యం పడేకేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి పారదర్శకత, దార్శనికత లోపించిందని పవన్ ధ్వజమెత్తారు. అమరావతి, గృహనిర్మాణంపై కూడా పవన్ తన నివేదికలో చర్చించారు.జగన్ సర్కారు పనితీరుపై ఏడాది వరకు మాట్లాడే అవకాశం తొలుత భావించామని, మూడున్నర నెలల్లోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చాయని జనసేనాని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా నడించిందని, వీటిని అరికడతామని గతంలో చెప్పిన వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు 19 లక్షల 34 వేల మంది రోడ్డునపడ్డారని దుయ్యబట్టారు. ఇసుక కొరత వల్లే వారంతా ఉపాధికోల్పోయారని, వంద రోజుల్లో ఇసుక విధానాన్ని తీసుకురాలేకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు.నవరత్నాలు జనరంజకమే గానీ, పాలన మాత్రం జనవిరుద్దమని ఎద్దేవా చేశారు. చౌకబారుగా కాకుండా లోతైన పరిశీలన చేసిన తర్వాతే విమర్శలు చేస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఆర్ధిక శాఖపై సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని, ప్రకాశం జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోతున్నాయని తూర్పారబట్టారు.శాంతి భద్రతలు క్షీణించాయని, పాఠశాలల్లో మౌలికవసతులు లేమి, దిగుబడులు తగ్గిపోయాయని నివేదికలో పవన్ వివరించారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఎంత దెబ్బతీశాయో, ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్ల అంతే నష్టం జరుగుతుందని జనసేనాని విమర్శించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం వైఎస్ఆర్సీపీకార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఓ సంస్థ ఎండీని బెదిరించారని, ఇలా అయితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని పవన్ నిలదీశారు.కృష్ణానదికి వరదలొస్తే మంత్రులు మాజీ ముఖ్యమంత్రి ఇంటిచుట్టూ తిరిగారని, అమాత్యులు బాధ్యతయుతంగా వ్యవహరించిలేదని ధ్వజమెత్తారు. మంత్రి పదవులను హనీమూన్‌లా భావిస్తున్నారని విమర్శించారు. రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతే మంత్రులు కనీసం సానుభూతి చూపకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందని దుమ్మెత్తిపోశారు.
రాయబారులతో ఏం సాధించారు టీడీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇసుక మాఫియా ఒక ప్రధాన కారణమని... ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. టన్ను ఇసుక రూ. 375 అని చెప్పి రూ. 500 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో నూతన ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారని అన్నారు. వైసీపీ జనరంజక మేనిఫెస్టోను అమలు చేయాలంటే రూ. 50 వేల కోట్లు కావాలని... కానీ, ఇప్పటికే రాష్ట్రం రూ. 2.59 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పారు. వైసీపీ 100 రోజుల పాలనపై నివేదికను పవన్ కల్యాణ్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీపై విమర్శలు గుప్పించారు.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి, గందరగోళం సృష్టించారని పవన్ మండిపడ్డారు. కియా పరిశ్రమ సీఈవోను కూడా అవమానించారని చెప్పారు. పరిపాలన ఈ విధంగా కొనసాగితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులను ఎవరైనా బెదిరిస్తారా? అని అడిగారు. 35 దేశాల రాయబారులను పిలిపించి నిర్వహించిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా ఏం సాధించారని ఎద్దేవా చేశారు.