బడిలో చెత్తను తొలగించిన కలెక్టర్
వరంగల్ అర్బన్, సెప్టెంబర్ 14,
పిల్లలకు ఆస్తులకంటే మంచి పర్యావరణాన్ని అందించడం వలన ఆరోగ్యవంతులుగా జీవిస్తారని జెడ్ పి చైర్మన్ డా.ఎం.సుదీర్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హసన్ పర్తి మండలం పెంబర్తి నాగారం గ్రామపంచాయితీలలో నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తో కలిసి పాల్గొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలను నాటి నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్లమద్య పెరిగిన చెత్తను తొటగించే పనులలో పాల్గొని శ్రమదానం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ను స్పూర్తిగా తీసుకుని మన గ్రామం-మనబాధ్యతగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ప్రణాళికలో బాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో నీటికరువు వున్న దేశాల్లో మనదేశం 13వ స్థానాల్లో ఉన్నదని తెలిపారు. గ్రామాలను హరితమయం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి ఇల్లు, వీధులు పచ్చని మెక్కలతో కనిపించాలని తెలిపారు. చెట్లువుంటేనే సకాలంలో సమృధిగా వర్షాలు పడుతాయని తెలిపారు.
వర్షపు నీటిని కూడా సంరక్షించేందుకు ప్రతి ఇంటికి ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటితో ఎస్ ఆర్ ఎస్ పిని పునరుజ్జీవింప చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక అమలుకు శ్రమదానం చేసిన ప్రతి వ్యక్తిని దాతగా పరిగణించనున్నట్లు తెలిపారు. సామాజిక భవనాలు, కార్యాలయాల
ఆవరణలు, రోడ్డు డ్రైనేజీలను స్వచ్ఛందంగా శ్రమదానం తో శుభ్రంచేసుకోవాలని పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రణాళిక అనంతరం ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 4 కిలో మీటర్ల పొడవున ట్రీగార్డులతో 1600 మొక్కలు కనిపించాలని స్పష్టం చేశారు. రోడ్లు డ్రైనేజీలను పరిశుభ్రంగా కనిపించాలని తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక డంపింగ్ యర్డు శ్మశానవాటిక ఉండాలని తెలిపారు. సర్పంచుల ఆధ్వర్యంలో నిర్మాణపనులు జరుగాలని తెలిపారు. శ్మశానవాటిక, డంపింగ్ యార్డు నర్పరీకి ప్రభుత్వ స్ధలాలను కేటాయించాలని తహాశీల్ధార్ ను ఆదేశించారు. ఆయా గ్రామాలలో పెంబర్తి సర్పంచ్ జె.పూల, నాగారం ఇంచార్జీ సర్పంచ్ అరుణ్ కుమార్, ఆద్యక్షతన జరిగిన గ్రామాసభలలో జెడ్ పిటీసి ఆర్.సునీత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి రజీనీ కుమార్, మండల ఉపాద్యాక్షుడు బండ రత్నకర్ రెడ్డి, మండలప్రత్యేక అధికారి కె.దామోదర్ రెడ్డి, తహాశీల్దార్ బి.రాజేష్, పి.వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.