మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య
హైదరాబాద్ సెప్టెంబర్ 16
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకున్న విషయం తెలిసిన వెంటనే అయనను బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో కూడా కోడెలకు గుండెపోటు వచ్చింది. కాగా.. గత కొన్ని రోజులుగా కోడెల, అయన కుటుంబ సభ్యులపై కెసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తననూ తన కుటుంబ సభ్యులనూ వేధిస్తున్నదంటూ పలుమార్లు ఆయన ఆరోపించారు. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
1947 మే నెల రెండవ తారీఖుల పుట్టిన కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుంటూరు ఏసీ కాలేజీలో పెయూసీ చదివిన అయన గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసారు. తరువాత 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో కోడెల చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి చెందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కోడెల 2014 నుంచి 2019 వరకు స్పీకర్ గా పనిచేశారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పనిచేశారు.