డాక్టర్ నుంచి...స్పీకర్ దాకా..
గుంటూరు, సెప్టెంబర్ 16,
అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు సోమవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తోంది. గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న ఆయన జన్మించారు. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదువుకున్నారు. విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ చదివారు.చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలచివేసింది. దీంతో కష్టపడి చదివి డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. తాతయ్య ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదివారు. కర్నూలులో ఎం.ఎస్. సర్జన్ పూర్తి చేశారు. పల్నాడు వాసులకు ఆయన వైద్య చికిత్స అందించారు. ఆయన హస్తవాసి గొప్పదని ఇప్పటికి చెప్పుకుంటారు.ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన వైద్యసేవలు అందించేవారు. కోడెల ముగ్గురు పిల్లలు విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ డాక్టర్లే కావడం విశేషం.1983 నుంచి 1999 వరకు నర్సరావుపేట నుంచి కోడెల వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. అనంతరం నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో ఆయన పని చేశారు. 1987-88లో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1997-99 మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు.నర్సరావుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కోడెల కీలక పాత్ర పోషించారు. కోటప్పకొండ అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయి౦చి, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.