జగన్ ఏరియల్ సర్వే...బాధితులకు ఓదార్పు
కాకినాడ, సెప్టెంబర్ 16,
తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎంతోపాటు హోం మంత్రి సుచరిత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న గాలింపు చర్యలను ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు.అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఇప్పటికే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.బోటు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. ఆదివారం 8 మృతదేహాలను వెలికి తీయగా.. సోమవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు రాష్ట్రంలో బోట్లు నడపొద్దని ప్రభుత్వం ఆదేశించింది.