కన్నా అరెస్ట్...
గుంటూరు, సెప్టెంబర్ 16,
రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రాజకీయ పరిణామాల దృష్ట్యా గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు కన్నాకు చెప్పారు. గురజాల ప్రాంతంలో సభలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు బీజేపీ నేతకు వివరించారు. కానీ కన్నా మాత్రం గురజాల వెళ్లడానికే మొగ్గు చూపారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కూడా పోరాటాలు చేసే సీఎం అయిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు నెలల్లోనే జగన్ సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కన్నా ఆరోపించారు. జగన్ తన అసమర్థ పాలనను కప్పి పుచ్చుకోవడానికి పోలీసులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా? పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతు నొక్కే ప్రయత్నం చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండా’ అని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వంద రోజుల పాలన వైఫల్యాలను వెల్లడించేందుకు గురజాలలో బహిరంగ సభ నిర్వహించడం కోసం బీజేపీ సిద్ధమైంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద సభ నిర్వహించాలని భావించారు. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోడంతో.. గురజాలలో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.