యురేనియం అన్వేషణ
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 17,
నల్లమలలో యురేనియం అన్వేషణకు ఆఫీసర్లు రహస్యంగా పావులు కదుపుతున్నారు. దీనికి బలం చేకూరేలా మూడు రోజులుగా భారత అణు ఇంధన శాఖకు చెందిన వాహనం నల్లమలలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తోంది. రాత్రిళ్లు 11 గంటల తర్వాత మన్ననూర్ లోని ఫారెస్టు క్యాంపు ఆఫీసులో మకాం వేస్తున్నారు. ఉదయం అచ్చంపేటలోని అటవీశాఖ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులను ఆగమేఘాల మీద చెట్ల లెక్కింపునకు పంపుతున్నారు. యురేనియం విషయం తెలిసినప్పటి నుంచి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుండడంతో ప్రతిపాదనలు అందినమాట వాస్తవమేనని, ఇంకా సర్వే మొదలుపెట్టలేదని ఆఫీసర్లు చెబుతూ వస్తున్నారు. మరోవైపు అడవిలో రహస్యంగా చెట్ల లెక్కింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిని గమనించిన నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ నాయకులు, ప్రజలు అధికారులపై నిఘా పెట్టారు రెండు రోజుల నుంచిభారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ వాహనం అచ్చంపేటలోని జిల్లా ఫారెస్టు అధికారి ఆఫీసుకు వెళ్లింది. అక్కడ సమావేశాలు నిర్వహించిన అనంతరం కొందరు హడావుడిగా ఏవో బ్యాగులను మూటగట్టుకుని లింగాలవైపు వెళ్లారు.ఉడిమిళ్ల ప్రాంతంలో కొందరు ఫారెస్టు ఆఫీసర్లు చెట్లకు రంగులు వేస్తున్నారని సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు ప్రజలు గాలింపు చేపట్టారు. అడవిలో కొన్ని రాళ్లు, చెట్లపై ఎరుపు రంగుతో గుర్తులు పెట్టి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఆ చుట్టూ అడవిలో గాలించి ఫారెస్టు ఆఫీసర్లను కనిపెట్టి నిలదీశారు. అసలు మీ పని ఏమిటి, మీరు చెట్లకు రంగులు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ఈ గుర్తులు పులుల కదలికల గురించి వేస్తున్నామని, సాసర్లు ఎన్ని ఉన్నాయో, చెట్లు ఎన్ని ఉన్నాయో లెక్కించమని తమ అధికారులు చెప్పారని వారు తెలిపారు. వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా కొన్ని మ్యాపులు, టేపులు, చెట్ల పేర్లతో కూడిన కాగితాలు కనిపించాయి. టేపులతో చెట్ల కొలతలను, వాటి వ్యాసాన్ని గమనించినట్లు కాగితాలపై రాసుండడం చూశారు. దీంతో ప్రజలు వారిని అడ్డుకున్నారు. మీరు అడవిని కాపాడుతున్నారా లేక చెట్లను అమ్ముకుంటున్నారా అంటూ ప్రశ్నించి వారిని అక్కడి నుంచి పంపించేశారు.నల్లమలలో యురేనియం పేరుతో భారత అణు ఇంధన శాఖ 83 చ.కి.మీ. మేర నాలుగు బ్లాకులను ఏర్పాటు చేసింది. 15 సంవత్సరాలుగా ప్రజల కన్ను కప్పి అనేక సర్వేలు చేసింది. చివరకు దాదాపు 21వేల ఎకరాలలో 4000 బోర్లను వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం భారత అణు ఇంధన శాఖ అధికారులు శనివారం లింగాల వైపు వెళ్లడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. 2015 సంవత్సరంలో నల్లమలలోని అమ్రాబాద్ మండల పరిధితోపాటు లింగాల, కొల్హాపూర్, అచ్చంపేట మండలాల పరిధిలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ క్లియరెన్స్ కోసం 2015 డిసెంబర్ లోనే ప్రతిపాదనలు పంపారు. అటవీశాఖ వెబ్ సైట్ లోని అంశాల ఆధారంగా లింగాల బ్లాక్ అచ్చంపేట పరిధిలో దాదాపు 20 చ.కి.మీ., కొల్లాపూర్, లింగాల బ్లాక్ పరిధిలో దాదాపు 50 చ.కి.మీ. మేర యురేనియం కోసం అన్వేషణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.