దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 24వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. 29 వస్తువులు, 53సేవలపై జీఎస్‌టీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తగ్గిన ధరలు జనవరి 25 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేసే అంశంపై చర్చించామని జైట్లీ చెప్పారు. అయితే ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆయన వెల్లడించలేదు. నందన్ నిలేకని పూర్తి స్థాయి వివరాలను వెల్లడిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1నుంచి ఈ-వే బిల్లులను తప్పనిసరి చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. 15రాష్ట్రాల ప్రభుత్వాలు ఇందుకు అంగీకారం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అందరూ భావించారు. కానీ ఆశించిన స్థాయిలో నిర్ణయాలు లేవని పలువురు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్‌పై సామాన్యులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. తదుపరి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చే అవకాశమున్నట్లు జైట్లీ తెలిపారు.