కోడెల ఆత్మహత్య కేసులో చంద్రబాబే నిందితుడు : కొడాలి నాని
విజయవాడ, సెప్టెంబర్ 17
టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, చంద్రబాబు వైఖరి వల్లే, పార్టీ పట్టించుకోక పోవడం వల్లే మాజీ స్పీకర్ బలవనర్మణానికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల ఆత్మహత్యపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.వైఎస్ఆర్సీపీ కేసులు పెడితే, ఆయన్ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే పోరాటం చేస్తారు. కానీ మనం నమ్ముకున్న వ్యక్తులు, పార్టీ మనల్ని వదిలించుకోవాలని భావిస్తే.. దూరం పెడితేనే.. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి క్షోభకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుపై ఆయన చేసిన విమర్శలు..కోడెల స్పీకర్‌గా ఉన్న సమయంలో చంద్రబాబు కోసం పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. నలుగుర్ని మంత్రులుగా చేసినా ఏం మాట్లాడలేదు. అలాంటిది.. ఈరోజు పార్టీ వ్యవహారాల్లో కోడెలను జోక్యం చేసుకోనీయడం లేదు. కోడెలకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. టీడీపీ నేతలే కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. శాసనసభ ఫర్నీచర్ వ్యవహారంలో ప్రభుత్వం చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని చంద్రబాబు మీడియాతో చెప్పారు. కోడెల శివ ప్రసాద రావును చంద్రబాబు మొదటి నుంచి అవమానించారు. 1999 ఎన్నికల సమయంలో కోడెల ఇంట్లో బాంబులు పేలాయని కేసు నమోదు చేసి విచారణ జరిపించింది చంద్రబాబే. అప్పుడు కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా.. జూనియర్ అయిన ఆలపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచిన నర్సరావుపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా సత్తెనపల్లి టికెట్ ఇచ్చింది, మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి ఇచ్చింది చంద్రబాబే.23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే.. వారిపై అనర్హత వేటు వేయకుండా కోడెలపై ఒత్తిడి చేసింది చంద్రబాబు నాయుడే. కోడెల కుమారుడితో కలిసి లోకేశ్ వాటాలు, కమీషన్లు తీసుకుంది నిజం కాదా..?కోడెల చనిపోయిన నాటి నుంచి చంద్రబాబు పల్నాడు పులి అని పిలుస్తున్నారు. 9 రోజుల పాటు పల్నాడులో బాధితుల క్యాంప్ నిర్వహించారు. ఆ క్యాంప్‌కి కోడెల రాకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుపడ్డారు? అని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలకు పల్నాటి పులి ఎందుకు హాజరు కాలేదు..? మీరు వద్దన్నారా? ఆయనకే ఇష్టం లేక రాలేదా? కోడెల ఓడాక నియోజకవర్గ ఇంఛార్జి పదవి నుంచి ఆయన్ను తొలగించాలని సత్తెనపల్లి ప్రాంతంలో ఓ గ్రూపును క్రియేట్ చేసింది ఎవరు..? కోడెలకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదు. కోడెల వల్ల పార్టీ ఇబ్బంది పడుతోంది. ఆయన్ను సస్పెండ్ చేద్దామా.. ఏం చేద్దాం అని మూడు రోజుల క్రితం గుంటూరు జిల్లా నాయకులతో మీరు చర్చించింది నిజం కాదా? శివ ప్రసాద రావు మిమ్మల్ని కలవాలని గత 15 రోజులుగా ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం కాదా? హైదరాబాద్‌లో కలుద్దామని ఆయనకు చెప్పి.. నేను బిజీగా ఉన్నా.. రేపు మాట్లాడదాం అని చెప్పింది నిజం కాదా? నిన్న ఉదయం 9.30 గంటల దాకా మీతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించి.. కుదరకపోవడంతో.. ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుంది నిజం కాదా? కోడెల పులి అయితే.. చంద్రబాబు నక్క. బాబు కోడెలను మోసం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను కూడా ఇలాగే పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేసి పదవి నుంచి దింపేశారు. తర్వాత దండలేసి శవయాత్ర చేసింది కూడా బాబే. ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ వేయాలని హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఆయన చనిపోయాక శవం కంటే ఎక్కువ బాబే కనిపించారు. కోడెల బతికి ఉండగా.. వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది, అక్రమ కేసులు పెడుతోంది, అవమానిస్తోందని చంద్రబాబు ఒక్కరోజైనా మాట్లాడారా? పల్నాడులో వైసీపీ బాధితుల క్యాంప్‌కి కోడెల వస్తానంటే.. రావొద్దని ఎందుకన్నారు..? ఆయనతో చేయించాల్సిన దురాగతాలన్నీ చేయించి పార్టీ నుంచి వదిలించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. కోడెల మీద ఏవైనా ఆరోపణలు వస్తే.. టీడీపీకి చెందిన ఒక్క నాయకుడు కూడా మీడియా ముందు మాట్లాడలేదు. పార్టీ నుంచి కోడెలను సస్పెండ్ చేయాలని ప్రయత్నించావ్. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే.. నీ నక్కజిత్తులు బయటపెడతాడని భయపడి.. ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పావని మండిపడ్డారు. చంద్రబాబు కోసం కోడెల ఎన్నిసార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించారో చూడండని కేసీఆర్ సర్కారును కోరుతున్నా. కోడెల కేసులో చంద్రబాబు నాయుణ్ని కూడా విచారణ జరపాలి. ఆయన చావుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఈ కేసులో ఏ1 నిందితుడు బాబే.ఎన్టీఆర్ శవయాత్రలో జనం చంద్రబాబుపై చెప్పులు విసిరారు. మనిషిని చంద్రబాబు ఎలా వాడుకుంటారు, అవసరం తీరాక ఎలా పక్కన బెడతారనేది ప్రజలు గమనిస్తున్నారు. పల్నాడు ప్రజలు నీపై దాడి చేస్తే మా మీద నిందలేయొద్దు. కోడెల చనిపోవడానికి కారణం బాబే. కోడెల సూసైడ్ నోట్‌లో తన మీద ఏమైనా రాశారోమోనని చంద్రబాబు భయపడ్డారు. అలాంటిదేమీ లేదని పోలీసులు తేల్చడంతో.. కాటి కాపరిలా శవరాజకీయాలు చేస్తున్నారు. కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదు. నమ్ముకున్న పార్టీ, కుటుంబ సభ్యులు అవసరం లేదని భావిస్తుండటంతో.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.