ఒంటరి తనం ప్రభావంతోనే ఆత్మహత్య...
గుంటూరు, సెప్టెంబర్ 18,
గుంటూరు జిల్లా నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. తనదైన శైలిలో ప్రజలకు చేరువైన కోడెల శివప్రసాదరావు. వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఆయన రాజకీయాల్లో మేరు నగగా ఎదిగారు. నరసరావుపేట నుంచి వరుసగా ఐదు సార్లు విజయం సాధించిన ఆయన టీడీపీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1987లోనే కోడెల శివప్రసాదరావు తొలిసారి హోంమంత్రి అయ్యారు. తనదైన వ్యక్తిత్వం, స్నేహ శీలత రాజకీయంగా ఎంతటి ప్రత్యర్థినైనా ఢీ అంటే ఢీ అనే తత్వం కోడెలకు సొంతం. అలాంటి కోడెల శివప్రసాదరావు 36 ఏళ్లుగా టీడీపీతోనే కలసి కొనసాగారు. పార్టీ గెలిచిన ప్పటికీ.. ఓడినప్పటికీ.. ఆయన సైకిల్‌ను వదిలి పెట్టకుండా ముందుకు నడిచారు.2014 ఎన్నికల్లో అయిష్టంగానే కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటీ చేసినా విజయం సొంతం చేసుకున్నారు. మంత్రి పదవిని ఆశించినా.. అది దక్కక పోయినా.. ఆయన దక్కిన స్పీకర్ పదవితోనే సరిపెట్టుకుని తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ముందు చూపుతో వ్యవహ రించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయేవారు. అయతే, తాజా ఎన్నికల్లో విజయం పొందలేక పోవడం ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిందనేది వాస్తవం. గతంలో స్పీకర్‌గా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీ పట్ల ఆయన కక్ష సాధింపు, అణిచి వేత ధోరణులు ప్రదర్శించారని వైసీపీ నేతలు మనసులో కూడా పెట్టుకున్నారు.టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాదరావు చేసిన పనులు ఆయన వ్యక్తిగతం కాదు… ఆయనకు మాత్రమే ఆపాదించలేం. అవన్నీ పార్టీ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. సరే ఏదేమైనా అధికారంలోకి వస్తుందని భావించిన టీడీపీ రాలేదు. దీనికితోడు కోడెల శివప్రసాదరావు కూడా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో కోడెల శివప్రసాదరావు ఎక్కడా పెద్దగా దిగులు పెట్టుకున్నది లేదు. ఎందుకంటే . సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గెలుపు ఓటములు సహజమని నమ్మిన నాయకుడు కాబట్టి. అయితే, తను స్పీకర్‌గా ఉన్న సమయంలో తన కుమారుడు, కుమార్తెలు విజృంభించి ప్రజలు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి పీడించి డబ్బులు వసూలు చేశారనే విమర్శలు, కేసులు పెరిగిపోయాయి. సహజంగానే ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి ఒత్తిళ్లు ఏ నేతకైనా సహజం అనుకున్నారు.అయితే, ఇంతలోనే అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం వెలుగు చూసింది. దీనిపైనా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీనిపై రెండు మూడు సార్లు కోడెల శివప్రసాదరావు స్వయంగా మీడియాకు వివరణ కూడా ఇచ్చారు. అయితే, ఇంత జరుగుతున్నా.. టీడీపీ నేతలు ఎవ్వరూ కూడా కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా మాట్లాడింది లేదు., ఆయనను సపోర్ట్ చేస్తూ.. చంద్రబాబు నుంచి ఎవరూ కూడా ముందుకురాలేదు. ఈ నేపథ్యంలోనే తాను మూడు దశాబ్దాలకు పైగా నమ్ముకున్న పార్టీతనను ఇప్పుడు ఒంటరిని చేసేసిందని అనేక మార్లు తన అనుచరుల వద్ద చెప్పుకొని కోడెల శివప్రసాదరావు బాధపడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని అనుకున్నారని బీజేపీ వైపు చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. సుజనా చౌదరితో పాటు బీజేపీ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు సైతం కోడెల శివప్రసాదరావుతో చర్చలు జరిపారన్న టాక్ కూడా ఇప్పుడు బయటకు వస్తోంది. అయితే , ఇంతలోనే కుటుంబంలో కలహాల కారణమో.. లేక మానసికంగా ఈ సమస్యలను ఓర్చుకోలేనని నిర్ణయించుకున్నారో.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజకీయాల్లో ఓ శకం ముగిసేలా చేశారు