YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన..

ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన..

ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మనసు కవి జీవితంలోని ఒక సరదా సంఘటన..
మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్ పీంచ్ సిగరేట్ పేకెట్లూ.. పళ్లెంలో ఆరారగా ప్రూట్సు.. ఇవివుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోవడం కోసం వస్తాడు, పేపర్లూ పాడ్‌తో. పెన్నుతెరిచి మరీ రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు.అంతే!
మళ్లీ సాయంత్రం. ఫ్రెష్ష్‌గా స్నానం చెయ్యడం.ధవళ వస్త్రాలు ధరించడం.. సిగరెట్ వెలిగించడం.
‘‘ఎందాకా వచ్చాం?’’ ‘‘ఏదీ... మొదలు పెట్టందే!’’
‘‘మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా! ఆ మొదలు దొరకడం లేదు.’’
‘‘ఓ మాట అనండి!’’
‘‘వేడి కాఫీ చెప్పు!’’
‘‘మాట అనమంటే ఇదా!’’
ఇలా వుంటుంది ఆయన ధోరణి.
పాట పూర్తికాదు.
గంటలు.. రోజులు.. వారాలు గడుస్తుంటాయి.
‘‘పాట’’ పుట్టదు.
హోటలుకి అద్దె పెరిగిపోతుంది. ప్రొడ్యూసరు లబోదిబోమంటాడు. సరిగ్గా ఇలా జరిగింది, పద్మశ్రీ పి పుల్లయ్యగారి మురళీకృష్ణ చిత్రానికి. ఇద్దరిమధ్య మంచి చనువుంది. తిట్లూ- పొగడ్తలూ సర్వసాధారణం. ఆరోజు అమీతుమీ తేల్చుకోడానికి పుల్లయ్యగారొచ్చారు.
‘‘పాట వొచ్చిందా?’’ పుల్లయ్యగారు.
‘‘వొచ్చి చచ్చింది!’’ ఆత్రేయ సమాధానం.
‘‘నన్ను చంపకు. ఇక రూమ్ వెకేట్‌చేసి బయలుదేరు!’’
‘‘ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నాను’’
‘‘సిగ్గులేదూ నీకు!’’
‘‘వుంటే సినిమాలకెందుకు పనిచేస్తాను!’’
వీరి మాటల్లో బూతులు సర్వసాధారణం. అవి వ్రాయదగ్గవి కాదు.
కారు ఆత్రేయగారింటికేసి దూసుకుపోతోంది వేగంగా.
అంతకుమించిన వేగంతో వారిమధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
పుల్లయ్యగారి ముఖంలో కోపం. ఆత్రేయ ముఖంలో చెక్కుచెదరని చిరునవ్వు.
‘‘దిగూ! నువ్వు ఎక్కడవున్నా- ఏవైనా.. నువ్వు సుఖంగా వుండాలనే నేను కోరుకుంటాను!’’ అన్నాడు పుల్లయ్యగారు.
అంతే! ఏదో ఫ్లాష్ వెలిగింది.
కారు తిప్పు. మన ఆఫీసుకి పోనివ్వు.. అన్నాడు ఆత్రేయ.
‘‘ఏం ఉద్ధరిద్దామని!’’
‘‘ఎలా- పోనియ్యవయ్యా!...
ఆఫీసు చేరుకుంది కారు.
‘‘ఎక్కడవున్నా- ఏమైనా’’
మనమెవరికి వారై వేరైనా...
నీ సుఖమే నే కోరుతున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా- సాకీ...పల్లవి. వచ్చేసింది.
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగినవన్నీ మంచికనీ,
అనుకోవడమే మనిషి పనీ... చరణం వొచ్చేసింది-
ఇక రెండవ చరణం-
‘వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయె రుజువుకదా- రెండవ చరణం వచ్చేసింది.
ముక్తాయింపు వుండాలి కదా-
‘‘నీ కలలే కమ్మగా పండనీ.
కలకాలం నీలో దాగనీ..
చిరంజీవిగా వుండాలనీ..
దీవిస్తున్నా.. నా దేవినీ.. దీవిస్తున్నా నా దేవిని..
పాట అయిపోయింది. పుల్లయ్యగారికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఆత్రేయ చేతుల్ని ముద్దుపెట్టుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ పాట మాస్టర్ వేణు చేతుల్లో పడింది. ఆయన ట్యూను చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. రిహార్సల్స్‌లో ఘంటసాల మాస్టారు విన్నారు. ఆయన ఆ పాటకి ప్రాణం పోశారు. ఘంటసాల మాస్టారి జీవితంలో అత్యంత ఇష్టమైన పాట.
వేణు మాస్టారికి ప్రాణం ఈ పాట.
పుల్లయ్యిగారికి ఈ పాట ఆరో ప్రాణం...
అక్కినేని నట జీవితంలో పూర్ణాయుష్షు నింపుకున్న పాట ఇది!
అయితే ఆత్రేయకిది కేవలం ‘పాట విడుపు’ మాత్రమే!..
 

Related Posts