మహాలయపక్షం – నువ్వులు నీళ్ళు
ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం.... దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో . . .
ప్రతి మానవుడు వారి పితృ దేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు ఋణపడిఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితోపాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్యయజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్నాయం చెయ్యడం, బోధించడం దేవయజ్ఞం. అందరిపలుపున దేవయజ్ఞం చెయ్యడం కొందరి పని. అందరు చెయ్యవలసినది చెయ్యగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణులయందు ప్రేమ, దయ కలిగిఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదోఒక రకంగా చేయవలసినవే. ప్రతిఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నాట్లు. “తిరుక్కురళ్” రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెబుతారు.
“తెన్పులత్తర్, దైయివం, విరుండు, ఒక్కళ్ తన్ ఎన్రు అంగు అయింబులత్తరు ఒంబళ్ తలై”
తెన్పులత్తర్ అంటే పితృదేవతలు - తాత ముత్తాతలు. అందరూ వారి ఋణాన్ని తీర్చవలసినదే. వేదము “మాతృదేవోభవ, పితృదేవోభవ” అని చెప్తుంది. అంటే మన తల్లి తండ్రులు దైవసమానులు. వారిని ఎన్నటికి దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికి వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లితండ్రులే. వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత, తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధ కర్మములు చేయవలెను. శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లితండ్రులను కాపాడుకోవలెను అని ఒప్పుకున్నారు.
“మనం సమర్పించే నువ్వులు, నీళ్ళు, అన్న పిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా? మనకళ్ళ ముండు చనిపోయినవారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా? పునర్జన్మ సిధ్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించియుంటే, వారికోసమని ఇవన్ని చెయ్యటం పిచ్చిపని” అని కొందరి వాదన.
మీకు ఒక కథ చెబుతాను.
”ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పైచదువులకై పంపించాడు. కొన్ని దినములలో ఫీజు కట్టవలనెని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాసాడు.” తండ్రి కార్త కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ గుమాస్తా “డబ్బు మీ అబ్బాయికి పంపబడింది. అతనికి చేరుతుంది” అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లా పెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు. అతను గుమాస్తా గారితో “నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది. వాటికి మీరు కన్నం కూడా చేయలేదు. మరి మా అబ్బాయికి ఎలా పంపారు?” అని అన్నాడు. గుమాస్తా అతనితో “మీ అబ్బాయికి చేరుతుంది” అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు. కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది. పితృదేవతలకు పిండప్రదానము చెయ్యడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టైతే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి, దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు. అది వారికి చెందుతుంది అంతే. ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా? అతను ఈ దేశములో నివసించకపోయినా, అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి, ఇక్కడ రూపాయిలలో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో, పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది. ఇక్కడ ముఖ్యముగా ఉండవలసినది తల్లితండ్రులయందు కృతజ్ఞతా భావము. శాస్త్రముయందు నమ్మకము. శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? “నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను. పోస్ట్ డబ్బాలో వెయ్యను. మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు.”
ప్రేమ, భక్తి, జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కాని ఫలమాసించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము. ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది.
“తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ”
--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము