YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కృష్ణ కన్నయ్య:  మనుష్యధర్మం

కృష్ణ కన్నయ్య:  మనుష్యధర్మం

కృష్ణ కన్నయ్య:  మనుష్యధర్మం
ప్రపంచమందలి ప్రతిప్రాణీ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉండటం మనం నిత్యమూ చూచేవిషయం. ఒక్క మానవులేకాక, పశుపక్షి కీటకాదులుకూడా ఎడతెగక ఏదో ఒకపని చేస్తూనే ఉంటవి. చీమ బియ్యపుగింజను శ్రమపడి తన కన్నంలోనికి లాక్కో వెళుతూంటుంది. పావురాలు ఆకాశంలో ఎగురుతవి. నత్త మందగమనం చేస్తూవుంటుంది. ఫైళ్ళను  మోసుకొని మనుష్యుడు కచ్చేరీలకు వెళ్ళుతుంటాడు. అది లేకపోతే ఏమూలనో ఒక పొలంలో పైరుపండిస్తూంటాడు. పనిలేనివాడొక్కడూలేడు. అనివార్యంగా అనవరతం పని, పని, పని, చేస్తూవుంది ప్రాణిలోకం. అందుకనే గీతలో భగవానుడున్నాడు. ''నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్'' ఈ విషయం అందరకూ అనుభవమే. కష్టంలేకుండా సుఖంగా కాలక్షేపం చెయ్యాలంటే మనం ఎన్నోసదుపాయాలు చేసుకోవాలి వానికి పని అవసరం. కర్మచేయకుండా ఒక క్షణం కూర్చోవటమంత కష్టమైన పని మరొకటి ఉండదు. అనుదినం ఎదుర్కొనవలసినవాటిలో క్షుద్భాధ ఒకటి. ఈక్షుద్వ్యాధికి అనుదిన చికిత్స చేస్తేకాని మించడమంటూలేదు. వ్యాధికి మందు ఎట్లు పరిమితంగా తీసుకొంటామో, తియ్యని మందని అధికప్రమాణం ఎట్లా గ్రహించమో అట్లే ఆకలిని అనుసరించి ఆహారానికి ఒక నియతి, నియమం ఉండాలి. ఐతే ఆకలితీరితే పనులు నిలచిపోతవా? ధనవంతునికి అన్నానికి కొరతలేదు. వానికి పనిచేయవలసిన అగత్యమేమి? నిజానికి వానికున్న పనులతొందర మరొకని కుండదు. సంపాదించింది జాగ్రత్త చేయాలి, మరింత సంపాదించాలి, మరింత కూడబెట్టాలి, మరింత జాగరూకత-ఇట్లు వాని కార్యపరంపరకు అంతంలేదు. స్వదేహరక్షణానికి కొన్నిపనులు. మాతాపితృభార్యాసుతులకు సంబంధించిన పనులు కొన్ని, పాలకోసంఉంచుకొన్న పశువులరక్షణ, ఇవి చాలవన్నట్టు మోజుకొద్దీ పెంచే పిల్లి, ఇంటినికాచేకుక్క, వీనికైపడేపాట్లు-సేవకులు, స్నేహితులూ వీరికై చేయవలసినపనులు, గ్రామసంబంధమైన పనులు మనిషి జీవితాన్ని కర్మశృంఖలాలలో బంధించివేస్తున్నవి. దంతధావనాదులూ, మజ్జన భోజనాదులూ సొంతపనులు, గృహనిర్మాణమూ, జీవనోపాధికి వలసిన వస్తుసంపాదనా తనకేకాక, తనకు దగ్గరగా సంబంధించిన వారికిన్నీ ఉపయోగపడేవి. రోడ్లువేయటం, కాలువలు త్రవ్వడం, ఆసుపత్రులు కట్టడం సామాజిక కార్యాలు. బీదలకు దానం చేయడం, రోగులకు శుశ్రూషచేయడం సానుభూతితెలిపే పనులు. వార్ధక్యంలో తమపనులు తాము చక్కబెట్టుకోలేక పోయినపుడు వారికి చేసేసేవ ఋణం తీర్చుకొనేపని. శైశవంలో తల్లిదండ్రులచే పాలింపబడి, వారి వృద్ధాప్యంలో తాను పెద్దవాడైవారికి చేసేసేవ ఈలాంటిది. 
ఇవికాక, 
ఎవనికైనా నీకు ఒకపూట భోజనంకావాలా? లేక పదిరూపాయలుకావాలా? అని అడిగితే రూపాయలే ఇవ్వమని కోరుకుంటాడు. రూపాయలను నిలువచేసుకొనే సుళువున్నది. ఒకపూట అవసరం అన్నం తీరిస్తే, పదిరోజుల అవసరం పది రూపాయలు తీరుస్తవి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నే ప్రతివారూ వాంఛిస్తారు. వాంఛలు అపరిమితమై పోయినవి ఈరోజుల్లో. పూర్వం బస్సులు, రైలుబండ్లు ఉండేవి కావు. ఎంతదూరమైనా నడచి వెళ్ళవలసివచ్చేది. దానికి తగినట్లే ప్రయాణావసరాలు పరిమితిలో ఉండేవి. ఇప్పుడట్లాకాదు. ఎక్కడికైనా పోవచ్చు ఎంతైనా ఖర్చుపెట్టవచ్చు. అందుచే అవసరాలూ, అవి లభించడానికి చేసే యత్నాలూ అపరిమితమైపోయినవి. ఆకాలంలో ఎంతదూరమైనా నడచిపోయేవారు. కాళ్ళు బలపడేవి. ఇప్పుడు అరమైలుదూరం వెళ్ళడానికి రిక్షా, టాక్సీలు అవసరం. మితి అనే మాట మనకోశంలో ఏమూలా గాలించినా కనబడదు. దూరాలోచనలో, భావికాలభాగ్యానికి ద్రవ్యం అర్జిస్తున్నాం. ఎంతని నిలువచేయడం? వేయిరూపాయలా, పదివేలా, లక్షా? ఆయుఃపర్యంతం ఆనందంగా ఉండాలని అందరి వాంఛ. మనకెంత ఆయువో మన మెరుగం. అది ఆ పరమేశ్వరునికే తెలియాలి. మనం సేకరించే వస్తువులు ప్రాణ మున్నంతవరకూ ప్రయోజనపడతవనుటలో ఏమాత్రం సందేహంలేదు. కాని అటుతర్వాత అవి నిష్ప్రయోజనమైపోతున్నవి. భవిష్యత్సౌఖ్యానికై పలువిధాల పరిశ్రమిస్తున్నా, నిరంతర సౌఖ్యం కలిగించే పనులు చేస్తున్నామా అంటే లేదు. నశించేది దేహమేకాని ఆత్మకాదు. అవినాశియైన ఆత్మలాభానికై చేసే పనులు, దేహానంతరం కరచరణాదు లుండవు కనుక, ఇహమందే నిర్వర్తించుకోవాలి. అంటేఆత్మజ్ఞానం మనంముందు జాగ్రత్తగా ఇన్యూర్ చేసుకోవాలి. 'ఈలోకం వాస్తవం. దీన్ని ఆలోకిస్తున్నాము కనుక, పరలోకం మనం చూడలేదు. ఇహంలో సౌఖ్యంగా వుండవలసిన విధి ఎంతైనా వుంది. మరణించిన పిదప మనమున్నామో లేదో ఎవరికెరుక?' అని ఎవరయినా అంటే, ఒకవేళ ఉన్నామనే అనుకుందాం. అపుడేమిచేయాలి? ఏడవాలా? ''నాస్తిచే న్నాస్తినో హనిః అస్తిచే న్నాస్తికో హతః'' దేహాంతరంజీవమున్నదనుకొన్నవాడు రెండువిధాల బాగుపడతాడు. లేదనుకొన్న నాస్తికుడు మోసపోతాడు. సత్కార్యాలవల్ల మంచి ఎన్నడూఉంది. ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకొన్నపుడు మనస్సు ప్రశాంతంగాఉండాలని కోరుకొన్నట్లే అంతిమప్రయాణంకూడా ఆనందగాఉండాలని కోరుకొంటే, దానికి తగిన విధులను నిర్వర్తించాలి. చేసే కర్మకు ప్రస్తుతం ఫలం లేకపోయినా, పిదప తప్పక ఉంటుందన్నది జ్ఞానమార్గంలో మనకు బాగా అవగతమవుతుంది. ఒకశక్తికి ప్రతిఫలం ఎప్పుడైనా ఉంటుందన్న న్యూటన్ సిద్ధాంతం మన పెద్దలు ఏనాడో గుర్తించి ఉన్నారు. క్రైస్తవులు జన్మాంతరసిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కాని మరణాంతరం ఒక న్యాయతీర్పు ఉందని అంటారు. దానిలో కర్మానుసారం స్వర్గమో, నకరమో నిశ్చయింపబడుతుంది అనిన్నీ అంటారు. సుఖదుఃఖాలు అనుభవించిన మృతదేహాన్ని పెట్టెలో పూడ్చరని అనుకొందాం. అయినప్పటికీ దేశాంతరంలో మళ్లా సుఖదుఃఖాలను అనుభవించేశక్తి దానికి వున్నదనే నమ్మికకదా ఈన్యాయతీర్పు చెబుతుంది. కాగా వారికి తెలియకుండానే జన్మాంతరసిద్ధాంతంలో విశ్వాసమున్న సంగతి ఇది సూచిస్తుంది. మన సుఖదుఃఖాలకు కారణం పూర్వంచేసుకొన్న కర్మ. పురాకృత ఫలం ఈజన్మ. ఈజన్మలోని సుకృతదుష్కృతాలనూ, తత్ఫలితమైన సుఖదుఃఖాలను అనుభవించేటందుకూ మరొక జన్మ అవసరంకాదా? అందుచే మతబోధనలను మనం విశ్వసించి, మతసంబంధమైన కార్యాలు చేస్తే ఇహానికేకాక పరానికికూడా ఫలితం కలిగిస్తుంది. 
వనవాసానికి బయలుదేరిన శ్రీరామచంద్రమూర్తిని కౌసల్యాదేవి- 
యం పాలయసి ధర్మం త్వం ధృత్వా చ నియమేన చ, 
సవై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు|| 
అని అశీర్వదిస్తుంది. ఆయన ఏధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడో ఆ ధర్మమే ఆయనను కాపాడుతుందని ఆతల్లి విశ్వసించింది. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల రక్షిస్తుంది. ఈశ్వరరాజ్యంలో చెలామణిఅయ్యే కాసులే ధర్మం.
నిరంతరానందాన్ని పొందాలంటే ఏంచేయాలి? చేసే ప్రతికార్యం ఈశ్వరార్పణచేయాలి. అట్టి కర్మ అనీశ్వరమైన ఆనందాన్నిస్తుంది. నూతనమార్గాలను త్రొక్కకుండా, పరంపరగా మన పెద్దలు వేనిని ఆచరించినారో, దానినే, మనమూ మన మతం చెప్పినచందంగా ఆచరిస్తే, అవి సులభంగానూ ఉంటవి, సౌఖ్యాన్ని ఇస్తవి. ఒక కార్యం చెడ్డదైనా సరే, స్వకీయమైన కామక్రోధకారణంగా కాక, స్వకుక్షింభరిత్వం కోసంకాక ఒక అధికవిశేషాన్ని అర్థించి, దాన్ని ఈశ్వరార్పిత చేస్తే అది ధర్మమే. 
మరి మనం ఏధర్మాన్ని పాటించాలి? పరంపరగావచ్చే ఆచారాలు మన పెద్దలనుష్ఠించి పరమసౌఖ్యాన్ని అనుభవించినట్లు తెలుస్తున్నది. నూతనపంథాలోని బాగోగులు మనకు తెలియవు. స్వప్రయోజనంకోసంకాక, బంధుస్నేహవర్గప్రీతి పొందడంకోసంకాక, సాముదాయిక క్షేమంకోసంకాక స్వాత్మలాభప్రాప్తికోసి పరంపరగా మనకు ప్రాప్తించిన యేసత్కార్యాలను నియమంతో, ధైర్యంతో, ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తామో అదే ధర్మం. మనోవాక్కాయాలనే త్రికరణాలతో ప్రతికార్యమూ ధర్మబద్ధంగా ఉండాలి. మన ద్రవ్యాన్ని ధర్మద్రవ్యంగా మార్చుకోవాలి. అది కాలపరిణామవశం కాక సార్వకాలిక ప్రమోజనకంగా ఉండాలి. మనుష్యుడు నిరంతరమూ ఉన్నతికి దారితీసే పనులు చేయాలి. ప్రాణివర్గంలో మనుష్యుడొక్కడే నిలువుగాపెరిగేది. తక్కినవన్నీ అడ్డంగా పెరిగేవి. అవి తిర్యక్కులు. మనుష్యుడోక్కడే నేరుగా ఎత్తుగా పైకిపైకి పోయేవాడు. నిలువుగా పెరిగే వాని రూపం వాని ఉన్నతిని చాటుతుంది. ధర్మాన్ని పాటించిన రామచంద్రమూర్తికి తిర్యక్కులు సహితం సాయపడినవి. అధర్మవర్తనం చేసిన రావణాసురునకు సొంతమ్ముడే సాయపడలేదు. 
యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యంచోపి సహాయాతాం, 
ఆపంథానం తు గచ్ఛంతం సోదరోపి విముంచతి|| 
- అనర్ఘరాఘవం. 
ధర్మానికి ఏకాలంలోనూ, ఏదేశంలోనూ అడ్డులేదు. అందుచే ధర్మాన్ని పాటించడం మనకు అత్యవసరమైన ధర్మం.                  --- “జగద్గురు బోధలు” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Related Posts