
బొబ్బిలిలో పేలిన బాణాసంచా - నేలమట్టమయని మూడు ఇళ్లు
విజయనగరం సెప్టెంబర్ 19,)
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం రెడ్డికె వీధిలో గురువారం తెల్లవారుజామున బాణాసంచా పేలింది. ఈ ఘటనలో మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. మరికొన్ని గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికంగా వుంటున్న జి.శ్రీనివాసరావు తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన జిలిటెన్స్టిక్స్ ప్రమాదవశాత్తు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో శ్రీనివాసరావు ఇంటితో పాటు పరిసరాల్లో ఉన్న జి.రమేశ్, సతీశ్ ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఆ శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. జి.భవాని, రామలక్ష్మితో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వచేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.