ఇంటింటా పోషణ్ అభియాన్ పై అవగాహన కల్పించాలి - జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి సెప్టెంబర్ 19
జల్లాలో పౌష్టికాహారం లోపం నివారించడానికి ప్రజలలో చైతన్యం కల్గించే దిశగా ఇంటింటా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. పోషణ్ అభియాన్, స్వచ్చ్ సర్వేక్షణ్ అభియాన్ సంబంధిత అంశాల పై రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కార్యలయంలో మెప్మా స్వశక్తి సంఘాల మహిళలు, అంగన్ వాడీ టీచర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ అధికారుల కృషి , ప్రజల సహాకారంతో జిల్లాలోని గ్రామాల్లో మంచి మార్పు వస్తుందని, దానికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో మన రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాకు 3 అవార్డులు అందాయని కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని నిర్వహించిన స్వచ్చత కార్యక్రమాలు, సోక్ పిట్ల నిర్మాణం వల్ల ఓపెన్ మురికి కాల్వలను మూసివేసామని, గత సంవత్సరం 213 డెంగ్యూ కేసులు నమోదు అయితే ప్రస్తుత సంవత్సరం కేవలం 17 మాత్రమే నమోదు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. పోషణ్ అభియాన్ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం పై పట్టణ ప్రాంతంలొ సైతం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. దేశంలో పౌష్టికాహార లోపాలను, ఎనిమియా వ్యాధులను తొలగించడానికి ప్రజలలో చైతన్యం కల్గించడానికి సెప్టెంబర్ మాసంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించే కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఎనిమియా వ్యాధి చాలా భయంకరంగా ఉంటుందని, అమెరికా దేశంలో నివాసం ఉండే తన సోదరి సైతం ఎనిమియా వ్యాధీతో చాలా బాధపడిందని కలెక్టర్ తన అనుభవాన్నీ గుర్తు చేసుకున్నారు. అనేవియా వ్యాధితో ఉన్న పిల్లలకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత్త సరిగ్గా ఉండవని, విద్య అభ్యసించడంలో వారు వైఫల్యం చేందుతుంటారని అన్నారు. దీనిని నివారించడానికి మనం అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, చక్కెర బదులు ఎక్కువగా బెల్లం ఉపయోగించాలని కలెక్టర్ అన్నారు. పౌష్టికాహర లోపం, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య తగ్గించడానికి మనం కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని గర్భవతులు, బాలింతలు, కౌమర బాలికలు, పిల్లలకు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని, ఇట్టి కార్యక్రమ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యచరణలో సైతం పోషణ్ అభియాన్ పై చర్చించాలని, గ్రామంలోని ప్రతి గర్భవతికి రక్త పరీక్షలు నిర్వహించాలని, అనేమియా ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక చికిత్స అందించాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో పిల్లలకు పౌష్టికాహర లోపం, దాని నివారణ తీసుకోవాల్సిన చర్యల పై అవగాహన కల్పించాలని , ప్రతి పాఠశాలలో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల పై చర్చ జరగాలని, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, పోషణ్ అభియాన్ విజయవంతం కావడంలో విద్యాశాఖ కొంత క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఆదేశించారు. పోషణ్ అభియాన్ కార్యకంమంలో భాగంగా సిబ్బంది జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి పోషణ్ అభియాన్ గురించి వివరించాలని, అదే సమయంలో సదరు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేని పక్షంలో పరిశుభ్రత పట్ల సైతం అవగాహన కల్పించాలని , స్వచ్చ్ సర్వేక్షణ్ అభియాన్ గురించి వివరించి SSG 2019 యాప్ నుండి వారి ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. స్వశక్తి సంఘాల మహిళలకు, ఇతరులకు ఇట్టి కార్యక్రమాలు పకడ్భందిగా నిర్వహించడానికి అవసరమైన వాహనాలను , ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 7 నెలల నుండి 2 సంవత్సరాల వయస్సు పిల్లల ఉన్న ఇంట్ల పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అందరి సమిష్టి కృషి ఫలితంగా జిల్లాకు 3 కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయని, ఇదే స్పూర్తితో పౌష్టికాహార లోపం పై సైతం ప్రజలలో అవగాహన కల్పిస్తూ దాని నివారణకు ఐక్యంగా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వర్ రావు, జిల్లా ఇంచార్జి డిఆర్డిఒ చంద్రప్రకాశ్, స్వశక్తి సంఘాల ప్రత్యేకాధికారి ప్రేమ్ కుమార్, మెప్మా సంఘాలు, అంగన్ వాడి బృందాలు,రిసోర్స్ పర్సన్స్, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.