ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం
సిద్ధిపేట సెప్టెంబర్ 19
ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019 పురస్కారానికి ఎంపికైంది.స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారం కోసం దేశ వ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి పోటీ తాకిడి ఉన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాంఘిక సామాజిక అభివృద్ధి అంశంపై సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. ఇప్పటికే గ్రామంలో పలు కార్యక్రమాలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎంతగానో ఇతర గ్రామాలకు స్ఫూర్తినిచ్చేలా ఆకట్టుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ-ఐపీఎస్, సంజీబ్ పాత్ జోషి స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారాన్ని ఇర్కోడ్ గ్రామానికి ప్రకటించారు. కాగా స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారం కింద రూ.8లక్షల రూపాయల క్యాష్, ప్రశంస పత్రాన్ని దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే ఇవ్వనున్నారని సిద్ధిపేట జిల్లా పంచాయతీ అధికారిక వర్గాలు తెలిపాయి.