నవంబర్ 15 వరకు ఎల్ ఐసీ రెన్యువల్స్
ముంబై, సెప్టెంబర్ 19,
మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే శుభవార్త. దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పాలసీ ల్యాప్స్ అయిపోయిన వారికి తీపికబురు అందించింది. ఆ పాలసీని మళ్లీ కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. దీని కోసం పాలసీ రివైవల్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.ఎల్ఐసీ పాలసీ పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా పాలసీ దారులు వారి ల్యాప్స్ అయిన పాలసీలను మళ్లీ కొనసాగించొచ్చు. ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. నిర్ణీత సమయానికి ప్రీమియం చెల్లించపోతే ఎల్ఐసీ వారికి సాధారణంగా 15 రోజులు గడువు ఇస్తుంది. ఈ గడువులోగా కూడా ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అప్పుడు పాలసీ పూర్తి ప్రయోజనాలను కస్టమర్లు పొందలేరు.అయితే ఎల్ఐసీ అప్పుడప్పుడు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి పాలసీదారులకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే పనిచేసింది. ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపైన్ రూపంలో పాలసీదారులు వారి పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. ఈ స్కీమ్ సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.ల్యాప్స్ అయిన పాలసీలు కలిగిన వారు నవంబర్ 15 లోగా వారి పాలసీని రెన్యూవల్ చేసుకోవచ్చు. పాలసీని రెన్యూవల్ చేసుకోవడం వల్ల పాలసీ కవర్ కొనసాగుతుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.