మార్క్ ఫెడ్ నిర్వాకంతో యూరియ కొరత
నిజామాబాద్, సెప్టెంబర్ 20,
రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులుగా యూరియా దొరక్కపో వడంతో సహకార కేంద్రాలు, పెస్టిసైడ్స్ దుకాణాల ఎదుట రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వరి చేనుల్లో యూరియా చల్లే దశ కావడంతో యూరియాకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే పత్తి చేలకు రెండుసార్లు యూరియాను వినియోగించారు. దీంతో ఉన్న యూరియా నిల్వలు ఖాళీ అయ్యాయి.గడ్డ కట్టిన యూరియా సరఫరాకు మార్క్‌ఫెడ్ నిర్లక్ష్యమని స్పష్టంగా తెలుస్తోంది. బఫర్ స్టాక్ విషయంలో మార్క్‌ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో దాదాపు రూ.8 కోట్ల విలువైన యూరియా బస్తాలు గడ్డ కట్టాయనేది సమాచారం. మార్క్‌ఫెడ్ వద్ద నాలుగేండ్లుగా లక్షల క్వింటాల్ల యూరియా పేరుకుపోయింది. ఏలాగోలా కొంతమేర యూరియాను రైతులకు అంటగట్టినప్పటికీ మరో లక్ష క్వింటాళ్ల వరకు యూరియా పనికిరాకుండా పోయింది. దీన్ని సైతం కొత్త బస్తాల్లోకి మార్చి రైతులకు సరఫరా చేయాలని మార్కెఫెడ్ అధికారులు భావించారు. అనుకున్నదే తడవుగా రూ. 50 ల
క్షల వ్యయంతో టెండర్లు పిలిచి.. పాత యూరియాను కొత్త బస్తాలోకి చేర్చి రైతులకు అంటగడుతున్నారు. మరి గడ్డకట్టిన యూరియా రైతుల పొలాల్లో ఏ మేరకు ఉపయోగకరంగా ఉంటుందో చూడాల్సిందే. దీనికితోడు నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీ యూరియా ఉత్పత్తి, సరఫరాను నిలిపివేయడం యూరియా కొరతకు కొంత కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం వరి పొలాల్లో యూరియాను వాడాల్సిన దశ. అయితే బోరుబావుల కింద సాగుచేస్తున్న పొలాల్లో ఇప్పటికే ఒకసారి యూరియాను చల్లారు. మరో వారం రోజుల్లో యూ రియాను చల్లేందుకు బస్తాలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. కాల్వకింద ఏరియాల్లో మాత్రం.. వరి పొలాలకు మొదటిసారే యూరియాను చల్లుతున్నారు. ఎందుకంటే.. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతానికి సాగు నీరు విడుదల చేయడంలో ఆలస్యమైంది. దీంతో అక్కడి రైతులు ఆలస్యంగానే సాగును మొద లుపెట్ట డంతో.. ప్రస్తుతం వారికి యూరియా అనివార్యమైంది.ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రానికి 7.5లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం
కేటాయించింది. కానీ ఇప్పటివరకు కేంద్రం 5.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసింది. గత ఆగస్టు నెలలో 2.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 93,023 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేశారు. ఇదిలావుంటే.. నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీ 64 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, నేటి వరకు ఒక్క బస్తాను సరఫరా చేయకుండానే చేతులు ఎత్తేసింది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు రావడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. వాస్తవంగానైతే యూరియాకు డిమాండ్ పెరిగినట్టుకాదనే చెప్పాలి. రాష్ట్రానికి కావాల్సినంత యూరియాను సరఫరా చేయకపోవడంతోనే గిరాకీ పెరిగింది. ఈ దశలో రైతులు సహకార కేంద్రాలను ఆశ్రయిస్తే.. వారికి నిరాశే ఎదురవుతోంది. తప్పనిసరి ప్రైవేటు ఫెర్టిలైజర్స్ దుకాణాలను సంప్రదించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు దుకాణాదారులు యూరియా కావాలంటే.. పొటాష్‌ను తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను పెడుతున్నారు.
ఒక్క పొటాష్ బస్తాకు రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. ఒకవేళ పొటాష్ వద్దనుకుంటే.. పురుగు మందులను కొనుగోలుచేసిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు.