హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో రైస్, బత్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆహార తయారీ విధానం ముసాయిదాపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమను మూడు దశల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు. కేబినెట్ ఆమోదించిన తర్వాత నాలుగేళ్లలో దశలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు జరగనున్నట్లు వెల్లడించారు. రూ. 50 కోట్లతో మిర్చికి సంబంధించిన ఆహారశుద్ధి పరిశ్రమ వస్తోందని మంత్రి పేర్కొన్నారు.