
భార్య పై చేయి చేసుకున్న బీజేపీ నేత - పార్టీ నుండి అజద్ సింగ్ సస్పెండ్
న్యూఢిల్లీ
ఢిల్లీలో మహ్రౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజద్ సింగ్ అందరూ చూస్తుండగానే తన భార్య సరితా చౌదరి (దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్)పై చేయి చేసుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే సహించే ప్రసక్తే లేదని..అజద్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశాం. జిల్లా అధ్యక్ష స్థానం నుంచి అజద్‌సింగ్‌ను తొలగించామని మనోజ్ తివారీ తెలిపారు.కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన నిన్న ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అజద్‌సింగ్ దంపతులు హాజరయ్యారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత కార్యాలయం ప్రాంగణంలో అజద్‌సింగ్ తన భార్య సరితా చౌదరిపై చేయి చేసుకున్నారు. నా భార్యే నన్ను తిడుతూ గొడవ ప్రారంభించింది. నన్ను తోసేందుకు ప్రయత్నించింది. ఆమె నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి చేయి చేసుకోవాల్సి వచ్చిందన్నారు అజద్ సింగ్.ఇదిలా ఉంటే ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు రాలేదని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ దీనిపై ఏదైనా ఫిర్యాదు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అజద్‌సింగ్‌కు ఆయన భార్యకు మధ్య కొన్నేళ్లుగా గొడవలవుతున్నాయని, అజద్‌సింగ్ విడాకుల కోసం దరఖాస్తు చేశారని పార్టీ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు.