అనంతపురం, : అసలే కరవు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న అనంతరైతుల గుండెల్లో సెజ్ గుబులు రేపుతోంది. పరిశ్రమలొస్తాయని భూములిచ్చిన రైతులు ఇప్పుడు ఉపాధి కోసం వలసబాటపడుతున్నారు. అప్పటి ప్రభుత్వం పరిశ్రమల పేరుతో వేల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. పరిహారమే కాదు.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నదాతలకు ఆశజూపారు. ఏళ్లు గడుస్తున్నా.. ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఉద్యోగం దేవుడెరుగు.. అన్నదాతలకు నేటికీ పూర్తిగా పరిహారం అందలేదు. ఇటు ఉపాధి లేక.. అటు పంటలు పండించేందుకు భూమి లేక మడకశిర పరిధిలోని గౌడనహళ్లి, ఆర్.అనంతపురం రైతులు వలస కూలీలుగా మారారు. మడకశిర మండలంలోని ఆర్.అనంతపురం, గౌడనహళ్లి గ్రామాల్లో పరిశ్రమలు స్థాపిస్తామని ఏపీఐసీసీ వారు 2012 నవంబరులో 141 మంది రైతుల నుంచి 1,648 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్.అనంతపురంలో 73 మంది రైతుల నుంచి 894.65 ఎకరాలు, గౌడనహళ్లిలో 68 మంది రైతుల నుంచి 754.17 ఎకరాలను తీసుకున్నారు. దీనికి సంబంధించి నేటికీ పరిహారం అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు ఉపాధి కరవై.. బతుకుజీవుడా అని వలస బాట పడుతున్నారు.
రైతుల నుంచి తీసుకున్న భూములకు అప్పట్లో నిర్ణయించిన ధర ఎకరాకు రూ.2.34 లక్షలు చెల్లించాలి. ఈ ప్రకారం రూ.38.56 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక నాలుగు విడతల్లో కలిపి రూ.16 కోట్లు ఇచ్చింది. మిగిలిన ఇంకా రూ.22.56 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. పరిహారం ఆలస్యమైతే ఏటా 20 శాతం ఎక్కువగా చెల్లిస్తామని తెలిపారు. రైతులకు మాత్రం గతంలో ప్రకటించిన ధర ప్రకారమే చెల్లించారు. ఈనేపథ్యంలో తమకు న్యాయం చేయాలని రైతులు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది. తమ పొలాలను ప్రభుత్వానికి ఇచ్చి ఇటు పరిహారం అందక.. అటు పనుల్లేక వలసలు వెళ్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రభుత్వాలు మారినా పరిహారం అందడం లేదని వాపోతున్నారు. ఏడేళ్లుగా రైతులు తిరగని కార్యాలయం లేదు.. కలవని అధికారులు లేరు. న్యాయం జరగకపోవడంతో విసుగెత్తిన అన్నదాతలు నిస్సహాయ స్థితిలో పడ్డారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో ఇళ్లు వదిలి ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.
పొలాలపై వివిధ బ్యాంకుల్లో రైతులు పంట రుణాలు తీసుకున్నారు. సెజ్ పేరుతో భూములను స్వాధీనం చేసుకోవడంతో ప్రభుత్వం అందించే పరిహారంలోనే బ్యాంకు వారు పంట రుణాలు జమ చేసుకుంటారని రైతులు ఎదురు చూశారు. ఏళ్లు గడిచినా పరిహారం రాకపోవడంతో రుణం చెల్లించాలని బ్యాంకు, కోర్టు నుంచి రైతులకు తాఖీదులు వచ్చాయి. దీంతో రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో రుణమాఫీ ప్రకటించినా వన్ బీలు రైతుల పేరిట లేకపోవడంతో వర్తించలేదు. ఏటా అందే పంట బీమా, నష్టపరిహారం కూడా రావడం లేదు. భూములు పోగొట్టుకున్న తమకు ఎకరాకు రూ.10 లక్షలు పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో భూములు వెనక్కి ఇవ్వాలనీ.. స్పందించకుంటే ఉద్యమిస్తామని చెబుతున్నారు. భూముల స్వాధీనం సమయంలో దాదాపు 55 ఎకరాల్లో దానిమ్మ, సపోట, జామ, మామిడి తోటలను రైతులు పోగొట్టుకున్నారు. కనీసం మొక్కల పరిహారం విషయంలో శాఖల మధ్య సమన్వయం లేక పరిహారం ఎంత అనేది తేల్చలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
---------