YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నగరం కాదు నరకం (గుంటూరు)

నగరం కాదు నరకం (గుంటూరు)

గుంటూరు, : జిల్లా కేంద్రమైన గుంటూరులో రోజు రోజుకూ గాలి కాలుష్యం పెరిగి పోతుండడంతో నగరవాసులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. 8 లక్షల మంది జనాభా.... లక్ష మందికిపైగా ప్రజల రాకపోకలు... 1.5 లక్షల వాహనాలు... భవన నిర్మాణ సామగ్రి రవాణా... రహదారులపై దుమ్ము, ధూళితో గాలి కలుషితమవుతోంది. ఇవి పరిమితికి మించి ఉండడంతో జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ పరిస్థితి నివారణకు కాలుష్య నియంత్రణ మండలి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా యంత్రాంగం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించి నిర్మాణాత్మక చర్యలకు నడుంకడుతోంది. గుంటూరులో గాలి నాణ్యత పరీక్షించడానికి నాలుగు కేంద్రాలను కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. నగరపాలక సంస్థ అతిథిగృహం, ప్రభుత్వ సమగ్రాస్పత్రి, ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం, ఆటోనగర్‌లో యంత్రాలు ఏర్పాటు చేసి గాలి నాణ్యతను పరీక్షిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఒక క్యూబిక్‌ మీటరు గాలిలో 50 మైక్రో గ్రాముల దుమ్ము, ధూళి కణాలు మాత్రమే ఉన్నట్లయితే నాణ్యతగా ఉన్నట్లు లెక్క. 60 మైక్రోగ్రాముల వరకు మానవ జీవనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ సమగ్రాస్పత్రి, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఆవరణలో క్యూబిక్‌ మీటరు గాలిలో 60 నుంచి 65 మైక్రో గ్రాములు దుమ్ము, ధూళికణాలు ఉంటున్నాయి. ఆటోనగర్‌, నగరపాలక సంస్థ అతిథిగృహం వద్ద ఉన్న యంత్రాల్లో క్యూబిక్‌ మీటరు గాలిలో 65 నుంచి 70 మైక్రో గ్రాముల వరకు ధూళికణాలు ఉంటున్నాయి. ఒక్కొక్కసారి వేసవి కాలంలో అయితే 70 మైక్రో గ్రాములకు మించి ధూళికణాలు నమోదవుతున్నాయి. ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, రహదారులు దుమ్ముమయం కావడం, ఆటోనగర్‌లో వాహనాల కాలుష్యం వల్ల గాలిలో ధూళికణాల సాంద్రత ఎక్కువగా ఉంటోంది. నిరంతరం 60 మైక్రో గ్రాముల పరిమితి దాటుతూనే ఉంది. దీనిని నివారించడానికి యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నగరంలో గాలి నాణ్యత పెంచడానికి పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా, నగరపాలకసంస్థ కమిషనర్‌, గుంటూరు అర్బన్‌ ఎస్పీ, ఉపరవాణాశాఖ అధికారి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు, సామాజిక అటవీశాఖ డీఎఫ్‌వో సభ్యులుగా ఉంటారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీరు మెంబర్‌ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కాలుష్యాన్ని తగ్గించే చర్యలను పర్యవేక్షించడంతో పాటు గాలి నాణ్యతను సమీక్షిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగం ఒక ప్రణాళిక తయారు చేసి అమలు తీరును కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి పంపారు. ప్రధానంగా చెత్త, ప్లాస్టిక్‌ వృథా, బయో మెడికల్‌ వృథా, నదీ తీర ప్రాంతంలో కాలుష్యం, పారిశ్రామిక క్లస్టర్లలో కాలుష్యం, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వద్ద కాలుష్యాన్ని తగ్గించడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య వల్ల వాహనాల రద్దీ పెరిగి నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ప్రయాణ సమయం పెరగడం వల్ల కాలుష్యం పెరుగుతోంది. దీనిని నివారించడానికి ట్రాఫిక్‌ రద్దీ తగ్గించే దిశగా ప్రణాళికలు అమలు చేయాలి. నగరంలోకి ఇసుక, మట్టి, భవన నిర్మాణ సామగ్రి తరలించే వాహనాలు దుమ్ము, ధూళి గాలిలోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకునేలా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలి. నగరంలోకి వాహనాలు ప్రవేశించే మార్గాల్లో తనిఖీలు చేసి సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అనుమతించాలి.

Related Posts