భారీగా తగ్గిన కార్పొరేట్ ట్యాక్స్
న్యూఢిల్లీ,
కార్పొరేట్ పన్నులను కుదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. కార్పొరేట్ పన్నును తగ్గించడం చరిత్రాత్మకమని, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కు ఇది గొప్ప శక్తిని ఇస్తుందని, ప్రపంచ దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడులు పెరుతాయని మోదీ అన్నారు. మన దేశ ప్రైవేటు సెక్టార్‌లోనూ పోటీతత్వం పెరుగుతుందన్నారు. 130 కోట్ల మందికి మరిన్ని ఉద్యోగాలు కల్పించే అవకాశం పెరుగుతుందన్నారు. గత కొన్ని వారాలను గమనిస్తే.. ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాకు ఎంత ఊతమిస్తుందో మీకే అర్థమవుతుందన్నారు. దీని ద్వారా వ్యాపారం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుతుందని మోదీ అన్నారు. కార్పొరేట్ కంపెనీలపై ఆదాయ పన్ను శాతాన్ని 30 నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఇవాళ కేంద్ర మంత్రి సీతారామన్ కార్పొరేట్ పన్ను శాతాన్ని తగ్గిస్తూ ప్రకటన చేశారు
సాహసోసేత నిర్ణయం : ఆర్బీఐ గవర్నర్
కార్పొరేట్ సంస్థలపై పన్ను శాతం తగ్గించడాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కొనియాడారు. ఇది సాహసోపేతమైన చర్య అన్నారు. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ సంకేతాన్ని ఇస్తుందన్నారు. కార్పొరేట్ పన్నును తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని, మన ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ సంకేతాన్ని ఇస్తుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. మన దేశంలో కార్పొరేట్ పన్నులు అధికంగా ఉన్నాయని, అదే మనకు పెద్ద విఘాతంగే మారిందని, ఇప్పుడు ఆ పన్ను శాతాన్ని తగ్గించడం శుభపరిణామం అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న థాయిలాండ్, పిలిప్పీన్స్ దేశాల్లోనూ ఇలాంటి పన్ను విధానమే ఉందన్నారు.ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని పరిశ్రమలు, స్టాక్ మార్కెట్లు స్వాగతించాయి. అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేసిన వారు.. ఈ సంస్కరణ వల్ల ఆర్థిక వృద్ధి రేటు పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులు కూడా పెరుగుతాయని వ్యాపారవేత్తలంటున్నారు. కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించడం అతి పెద్ద సంస్కరణ అని కోటక్ మహేంద్ర బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సీతారామన్‌ను బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా కూడా ప్రశంసించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా పన్ను తగ్గింపు అంశాన్ని కీర్తించారు. ఇది ఆర్థిక బలోపేతానికి సహకరిస్తుందన్నారు.