YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వరుణ్ మార్క్ చూపించిన గద్దలకొంగ గణేష్

వరుణ్ మార్క్ చూపించిన గద్దలకొంగ గణేష్

హైద్రాబాద్,
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడమంటే అంత సులభమైన పనికాదు. కథలో అసలు విషయం దారితప్పకుండా మన ప్రేక్షకులకు నచ్చేలా తీయాలి. అవసరమైతే మన ప్రాంతీయతకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలి. ఇలాంటి రీమేక్‌లు ప్రతి దర్శకుడు చేయలేరు. దానికి వేరే టాలెండ్ ఉండాలి. అలాంటి టాలెండ్ కలిగిన దర్శకుడు హరీష్ శంకర్.హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ‘దబాంగ్’ను మన ప్రాంతీయతకు తగ్గట్టు ‘గబ్బర్ సింగ్’గా తెరకెక్కించి పవన్ కళ్యాణ్‌తో సూపర్ హిట్టుకొట్టారు. రీమేక్‌లు చేయడంలో హరీష్‌కు తిరుగులేదు అని ఒక్క సినిమాతోనే నిరూపించుకున్నారు. ఇప్పుడు తమిళంలో విజయవంతమైన ‘జిగార్తండ’ను వరుణ్ తేజ్‌తో ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఒక రౌడీ షీటర్‌ను సినిమా అనే మీడియం మంచి మనిషిగా ఎలా మార్చింది అనేది ఈ కథ అసలు సారాంశం. అభిరామ్ (అధర్వ మురళి)కి సినిమాలంటే పిచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఒక సినిమా సెట్‌లో దర్శకుడితో గొడవ పడి సంవత్సరంలోపు అందరూ మెచ్చుకునే సినిమా తీస్తానంటూ ఛాలెంజ్ విసురుతాడు. అదృష్టవశాత్తు అతన్ని డైరెక్టర్‌ను చేయడానికి ఒక నిర్మాత (రఘుబాబు) ముందుకొస్తాడు.అత్యంత భయంకరమైన ఒక రౌడీ షీటర్‌ కథతో సినిమా తీయాలని అభి నిర్ణయించుకుంటాడు. తన సినిమా కోసం గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను ఎంచుకుంటాడు. గద్దలకొండ వెళ్లి రహస్యంగా గణేష్ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? అభి తీసిన సినిమా వల్ల గణేష్‌లో మార్పు ఎలా వచ్చింది? వంటి విషయాలు సినిమాలోనే చూడాలి.ఒక సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ‘గద్దలకొండ గణేష్’లో ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ, వేటికీ పూర్తి న్యాయం చేయలేదు అనిపిస్తుంది. బహుశా సినిమా నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఫీలింగ్ కలుగుతుందేమో. సినిమా ప్రారంభమైన వెంటనే వరుణ్ తేజ్ కనిపించే తొలి సన్నివేశమే అద్భుతంగా ఉంది. ఈ సన్నివేశంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసి కథను ఆరు నెలల వెనక్కి తీసుకెళ్లారు. ఇక అక్కడి నుంచి గద్దలకొండ గణేష్ అరాచకం మొదలవుతుంది.అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ సాఫీగానే సాగింది. వరుణ్ తేజ్ మేనరిజం, డైలాగులు, సత్య కామెడీ ప్లస్ అయ్యాయి. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఈ ట్విస్ట్‌తో సెకండాఫ్‌లో చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, సెకండాఫ్ కాస్త నీరసించింది. ఎంటర్‌టైన్మెంట్ లోపించింది. దీనికి తోడు నిడివి కూడా ఎక్కువగా ఉండటం సాగదీసిన భావన కలిగిస్తుంది. అంతేకాకుండా, లాజిక్ లేని సన్నివేశాలు కాస్త విసిగిస్తాయి. రౌడీ షీటర్ ఒక హీరోగా పరిచయమైన తీరు లాజిక్‌కు అందని విధంగా ఉంది.అయితే వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడి దృష్టిని మళ్లిస్తుంది. వరుణ్ తెరపై కనిపిస్తున్నసేపు ఆయన మాయలోనే పడిపోతాం. ఒరిజినల్ సినిమాలో లేని లవ్ ట్రాక్‌ను హరీష్ శంకర్ ఇందులో చొప్పించారు. ఈ ఎపిసోడ్ బాగుంది. వరుణ్ లుక్ కొత్తగా ఉంది. పూజా హెగ్డే‌తో వరుణ్ కెమిస్ట్రీ మరోసారి పండింది. ఈసారి కాస్త ఓల్డ్ గెటప్స్‌లో ట్రై చేయడంతో కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ కాస్త వీక్‌గానే ఉన్నా ఎమోషన్స్ బాగానే పండాయి. గద్దలకొండ గణేష్, అతడి తల్లి మధ్య క్లైమాక్స్‌లో వచ్చే సీన్ కంటతడి పెట్టిస్తుంది.ఇక ఈ సినిమాకు ప్రధాన బలంగా వరుణ్ తేజ్‌ను చెప్పుకోవాలి. గద్దలకొండ గణేష్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అందగొప్పగా ఆ పాత్రను పండించారు. ఆ ముఖంలో క్రూరత్వం, ప్రవర్తనలో మొరటితనాన్ని వరుణ్ బాగా చూపించారు. మరో కీలక పాత్రలో నటించిన తమిళ నటుడు అధర్వ మురళి పర్వాలేదనిపించారు. ఆయన నటన అంత గొప్పగా ఏమీలేదు.కమెడియన్ సత్య మాత్రం తన హావభావలు, మేనరిజంతో ‘చింతపండు’ చేసేశారు. చింతపండు అని ఎందుకు అన్నానో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక, కొత్తమ్మాయి మృణాళిని అభినయంతో ఆకట్టుకుంది. పెళ్లిచూపులు సీన్‌లో ఆమె నటన చాలా బాగుంది. తనికెళ్ల భరణి కనిపించింది కాసేపే అయినా ఆ పాత్రలో తన అనుభవాన్ని చూపించారు. అన్నపూర్ణ, శత్రు, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రఘుబాబు, రచ్చ రవి, ఫిష్ వెంకట్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.ఇక తెరవెనుక విభాగం గురించి మాట్లాడుకుంటే.. ముందుగా హరీష్ శంకర్ డైలాగ్స్‌ను మెచ్చుకోవాలి. చాలా సాధారణంగా, ప్రేక్షకుడికి వెంటనే రీచ్ అయ్యేలా సింపుల్ పదాలతో డైలాగులు అద్భుతంగా రాశారు. ‘సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ చేయదు.. ఎంటర్‌టైన్ చేస్తుంది’ అనే మెసేజ్‌ను కూడా ఇచ్చారు. ‘మనం చేసే పనిని వదిలిపెట్టి వేరే పని చేయడం కాంప్రమైజ్ కావడం.. మనం చేసే పనిలోనే మార్పులు చేసుకోవడం అడ్జస్ట్ అవ్వడం’ అనే ఫిలాసఫీ కూడా చెప్పారు.హరీష్ శంకర్ తరవాత ఈ సినిమాకు మరో తెరవెనుక బలం సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. నాలుగు చక్కని పాటలతో పాటు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అందించారు. ‘వక వక వక’ అంటూ వచ్చే నేపథ్య గానం కచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్‌లో గణేష్, శ్రీదేవిల లవ్ ట్రాక్‌కు కూడా చాలా మంచి నేపథ్య సంగీతం అందించారు. అసలు సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడే మిక్కీ ఆర్ఆర్ స్టామినా ఏంటో తెలిసిపోతుంది.సినిమాటోగ్రాఫర్ అయనాంకా బోస్ పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూస్తే ‘గద్దలకొండ గణేష్’ భారీ అంచనాలను అందుకోలేకపోయినా ఫర్వాలేదనిపించాడు.

Related Posts