రేషన్ దుకాణాల్లో పరేషాన్ సిగ్నల్స్ అందక అభాసుపాలవుతున్న ఈ పాస్
అనంతపురం,
నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు సకాలంలో సరకులు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. కార్డుదారులు అందిరికీ సరుకులు చేరుతున్నా డీలర్లు తూకాల్లో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి దుకాణంలో బియ్యం పంపిణీకి పెద్ద డబ్బా, కందిపప్పు, చక్కెరకు చిన్న డబ్బా వాడుతున్నారు. డబ్బాలను త్రాసుపై పెట్టి తూకం వేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. డబ్బా బరువే డీలర్లకు మిగులుబాటు. పెద్ద డబ్బా రెండు కిలోలు, చిన్నడబ్బాలు 100నుంచి 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. సరుకులన్నీ బయట తూకం వేయించుకుంటే తక్కువ తూకం రావడంతో కార్డుదారులు కంగుతింటున్నారు. జిల్లాలో చౌకధరల దుకాణాల్లో అక్కక్కడ తూనికలు, కొలతలు అధికారులు తనిఖీల్లో సరుకులు తక్కువ తూకాలు బయటపడ్డాయి. ఆ లెక్కన ప్రతినెల 2,610 టన్నులు దోపిడీ జరుగుతోంది. అందులో 2,400 టన్నుల బియ్యం రూ.2.40 కోట్లు, 120 టన్నులు కందిపప్పు రూ.78 లక్షలు, 90 టన్నుల చక్కెర రూ.27 లక్షలు బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.బియ్యం, కందిపప్పు, చక్కెర పంపిణీలో మోసం పెచ్చుమీరింది. కార్డుదారుల వారిని ప్రశ్నిస్తే ఎదురు తిరుగుతున్నారు. చేసేదిలేక లబ్ధిదారులు వారిచ్చిన సరకులే తీసుకెళ్తున్నారు. ప్రతినెలా ఒకటి తేదీ నుంచి 15వ తేదీ వరకు దుకాణాలు తెరచి ఉంచాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. చాలా మంది డీలర్లు రెండు, మూడు రోజులు మాత్రమే సరకులు పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రతికార్డుదారునికి రశీదు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండగా అది ఎక్కడా ఇవ్వడం లేదు. సర్వర్ పనిచేయడం లేదని, వేలి ముద్ర పడటం లేదని, వినియోగదారులను మళ్లీ రమ్మంటూ వెనక్కి పంపతున్నారు. పదేపదే వారిని తిప్పుకోవడంతో వారు సరకులు తీసుకోకుండా వదిలేసుకుంటున్నారు. దీంతో డీలర్లు వాటిని దోచేస్తున్నారు. కొందరు తూకంలో, సరకుల్లో కోత విధించి సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన తహసీల్దార్లు, పౌరసరఫరాలశాఖ ఉప తహసీల్దార్లకు మాముళ్లు అందడంతో వారు దుకాణాలవైపు కన్నెత్తి చూడటం లేదు.బియ్యం, కందిపప్పు, చక్కెర మొత్తం కలిపి నెలకు 22,074 టన్నులు సరకులు పంచుతున్నారు. బియ్యం ఒక్కో మనిషికి ఐదు కిలోల చొప్పున కార్డులో ఎంతమంది ఉంటే అన్ని కిలోలు ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.70 పలికే మేలు రకం కందిపప్పును ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా రూ.40కే పంపిణీ చేస్తోంది. ఈ నెలలో మండలంలోని 35 చౌకదుకాణాల ద్వారా 15,643 కుటుంబాలకు 31,615 కిలోల కందిపప్పు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతి కార్డుదారునికి రెండు కిలోల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. దుకాణానికి వచ్చిన లబ్ధిదారునితో కొందరు డీలర్లు అన్ని నిత్యావసర సరకులకు ఒకేసారి వేలిముద్ర వేయించుకొని కందిపప్పు మాత్రం కిలో అందజేస్తున్నారు. ఈ-పోస్ యంత్రం నుంచి వచ్చే ముద్రణ కాగితం కూడా వినియోగదారునికి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కిలో మాత్రమే పంపిణీ చేస్తోందని మిన్నకుండిపోతున్నారు. కోత విధిస్తూ డీలర్లు అవినీతికి పాల్పడుతున్నారు. మండలంలో దాదాపు 100 క్వింటాళ్ల పప్పు ప్రజలకు చేరలేదని తెలుస్తోంది.కనీసమంటే కార్డుకు 15-20 కిలోల వరకు కిలో రూపాయి చొప్పున పంచుతున్నారు. అందులో కార్డుకు 2-3 కిలోల చొప్పున తూకం తక్కువ ఇస్తున్నారు. కందిపప్పు కార్డుకు రెండు కిలోల చొప్పున ఇస్తుంటే అందులో కిలోకు 150 గ్రామలు చొప్పున రెండు కిలోలకు 300 గ్రాములు కోత విధిస్తున్నారు. కార్డుకు చక్కెర ఇచ్చేదే అరకిలో. అందులో 100 గ్రాములు నొక్కేస్తున్నారు. ఆ లెక్కన 2,400 టన్నుల బియ్యం, 120 టన్నుల కందిపప్పు, 90 టన్నుల చక్కెర కలిపి నెలకు రూ.3.45 కోట్లు చొప్పున ఏడాదికి రూ.41.40 కోట్లు వరకు దోపిడీ సాగుతోంది.