కేజ్రీకి క్రేజ్ తగ్గుతోందా
న్యూఢిల్లీ,
మరి కొద్ది నెలల్లో మాత్రమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెాజారిటీ సాధించిన కేజ్రీవాల్ భవితవ్యంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే దిశగా పయనిస్తోంది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో పట్టు ఉండటం, ముస్లిం ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ కన్నేయడంతో కేజ్రీవాల్ కు ఈ దఫా ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు.ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోయింది. కేజ్రీవాల్ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన నేతలు సయితం కేజ్రీవాల్ ను విడిచిపెట్టడం ఆందోళనకర పరిణామమే. ఇటీవల ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే ఆల్కా లాంబా ఆమ్ ఆద్మీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని గతంలో ప్రకటించారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చావుదెబ్బతినింది. ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా క్రేజీవాల్ పార్టీ గెలుచుకోలేక పోయింది. దీంతో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉందని గుర్తించిన పార్టీ నేతలు మెల్లగా జారుకుంటున్నారు. కేజ్రీవాల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఢిల్లీ వాసులపై వరాల జల్లు ప్రకటిస్తున్నా అవి ఎంత ప్రభావం చూపుతాయన్నది స్పష్టంగా చెప్పలేం. ముఖ్యంగా మధ్యతరగతి, యువత, మహిళల ఓట్లపైనే కేజ్రీవాల్ దృష్టి పెట్టారు.ఇక గత లోక్ సభ ఎన్నికల్లో తాము కోల్పోయిన ముస్లిం ఓటు బ్యాంకు ను కూడా తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ బలంగా ఉండటంతో కేజ్రీవాల్ అన్ని వర్గాలనూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. వరసగా రెండు సార్లు విజయం సాధించిన కేజ్రీవాల్ ను ఈసారి ఢిల్లీ వాసులు ఆదరిస్తారో? లేదో? చూడాలి.