కొత్త జిల్లాలపై ఇంకా టైముంది..
విజయవాడ,
వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు.కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన కొంత సమయం తీసుకునే అవకాశముందంటున్నాయి పార్టీ వర్గాలు. జగన్ తన పాదయాత్ర సమయంలో అధికారంలోకి తాను వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ప్రకటిస్తానని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని మాట ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా కొత్త జిల్లాల అంశంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలున్నాయి. జగన్ మాట ఇచ్చినట్లుగా చూసినట్లయితే 25 జిల్లాలకు ఆ సంఖ్య పెరుగుతుంది. అయితే పాలనపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. సిబ్బంది సంఖ్య కూడాతక్కువగానే ఉంది. ఐఏఎస్ అధికారుల కొరత కూడా ఉంది. పైగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తే రెవెన్యూ పరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొన్నిజిల్లాల ఏర్పాటు ఇప్పట్లో వద్దని పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు కూడా జగన్ పై వత్తిడి తెస్తున్నారు.ముఖ్యంగా ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన నేతలు జిల్లాల ఏర్పాటు వాయిదా వేయాలని కోరుతున్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెంటనే కొందరు తమకు జిల్లా కావాలంటూ స్థానికంగా ఆందోళనలకు దిగడాన్ని ఈ సందర్భంగా నేతలు జగన్ వద్ద గుర్తు చేశారు. మరికొందరు తమను ఇక్కడే కొనసాగించాలని కొత్త జిల్లాలో కలపొద్దన్న డిమాండ్లు కూడా అనేక ప్రాంతాల నుంచి విన్పిస్తున్నాయి. ఈ డిమాండ్లన్నీ జగన్ దృష్టికి ఇప్పటికే వెళ్లాయి.
దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబరులో జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో స్థానిక సంస్థల్లో ఫలితాలు తేడా కొట్టే అవకాశముంది. అందువల్ల ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటు యోచనను వైసీపీ ప్రభుత్వం వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అంతా సక్రమంగా ఉంది, పాలన గాడిలో పడిన తర్వాత దాని గురించి ఆలోచించాలని నిర్ణయించారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంత అభివృద్ధి జరిగిన తర్వాతనే కొత్త జిల్లాల ఏర్పాటును స్పీడ్ అప్ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశం లేదు. 2020 తర్వాతనే దీనిపై జగన్ దృష్టి పెట్టే అవకాశముంది.