పండగ సీజన్‌లో ప్రత్యేక మోత
రద్దీలేనప్పుడు టికెట్లపై రాయితీ
రైల్వే బోర్డుకు చార్జీల కమిటీ సిఫారసు
అమోదిస్తే ప్రయాణికులపై భారమే
రైలులో దూర ప్రయాణాలు చేసేవారు దిగువ బెర్తులను కోరుకుంటున్నారా? అలాగే.. పండగల సీజన్‌లో రైలులో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే మీ చేతి చమురు వదలాల్సిందే. ఎందుకంటే.. దిగువ బెర్తులు ఎంపిక చేసుకునేవారు, పండగల సీజన్‌లో ప్రయాణించే వారి నుంచి అధిక టికెట్ ధరలు వసూలు చేయాలని రైల్వే చార్జిల కమిటీ సిఫారసు చేసింది.
ఒకవేళ వీటిని రైల్వే బోర్డు కనుక ఆమోదిస్తే ప్రయాణికులపై పెను భారం పడనుంది. ఎయిర్‌లైన్స్, హోటళ్ల తరహాలో రైల్వేలోనూ టికెట్ ధరలను పెంచాలని, ఇదే విధానాన్ని అవలంబించాలని కమిటీ సూచించింది. అలాగే, నిర్దిష్ట మార్గంలో అనుకూల సమయాల్లో నడిచే రైళ్లు, ప్రజాదరణ ఎక్కువగా ఉండే రైళ్లలోనూ చార్జీలను పెంచాలని సూచించింది. పండగల సీజన్‌లో టికెట్ ధరలు పెంచాలని, రద్దీ పెద్దగా లేని సమయాల్లో తక్కువ చార్జీలు వసూలు చేయాలని, అసౌకర్యంగా ఉండే సమయాల్లో గమ్యస్థానాలకు చేరే రైళ్లలోని ప్రయాణికులకు రాయితీలను ఇవ్వాలని సిఫారసు చేసింది.