ప్రతిభకు పట్టం అంటే ఇదేనా ! టఫ్ పేపర్‌కు ఇన్ని మార్కులా? ప్రభుత్వంపై రాకేష్ రెడ్డి ద్వజం.
పుత్తూరు
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ పరీక్షల్లో భారీ బాగోతంచాపకింద నీరులా సాగిపోయిందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అద్యక్షుడు రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశంలో ద్వజమెత్తారు. గురువారం ఫలితాలు ప్రకటించిన వెంటనే ఈ పరీక్షల్లో జరిగిన గూడుపుఠాణి బట్టబయలైందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం కేంద్రంగా జరిగిన కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా పాకినట్లు తెలుస్తోందన్నారు. సర్వీసు కమిషన్ ఉద్యోగులు కొందరు ప్రశ్నపత్రం సంపాదించి తాము ప్రయోజనం పొందడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక మందికి ఈ పేపర్లు అందజేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వహస్తాలతో విడుదల చేసిన ఫలితాల్లో కేటగిరి-1లో జి.అనితమ్మ(అనంతపురం) అనే యువతి టాప్ ర్యాంకర్‌గా నిలిచారని, ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్‌గా అనితమ్మ పనిచేస్తున్నారని తెలిపారు. సచివాలయ పరీక్షల్లో అంతా పకడ్బందీగా చేశామని ముఖ్యమంత్రి, అధికారులు బల్లగుద్ది చెప్పినప్పటికీ లోలోపల చాలా వ్యవహారాలు నడిచినట్లుగా ఈ ఫలితాలే చెబుతున్నాయన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల్లో పారదర్శకంగా ప్రతిభకు పట్టం కట్టాలని తాము సూచిస్తున్న ప్పటికీ, పగడ్బందీగా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకో కుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.