శ్రీశైలం డ్యాం మూడు గేట్లు ఎత్తివేత
కర్నూలు
ఎగువ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం ప్రవహిస్తుంది. డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లలో మూడు క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఎంత నీటి ప్రవాహం ప్రవహిస్తుందో అదేస్థాయిలో జలాశయం నుంచి ఔట్‌ఫ్లోను కూడ విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాం నీటి మట్టాన్ని మెంటెయిన్ చేస్తున్నారు. జలాశయంలో పూర్తిస్థాయిలో నీటినిల్వలు ఉండడంతో జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి 884.80 అడుగులు, జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలుగా నమోదయ్యాయి.జలాశయం క్రస్ట్ గేట్ల ద్వారా 46,494 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 68,976 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 110 క్యూసెక్కులు మొత్తం జలాశయానికి 1,60,087 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రవహిస్తుంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 26,510 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. ఎడమగట్టు భూగర్బ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 40,259 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు.
జలాశయ బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 5,000 క్యూసెక్కులు, తెలంగాణ ప్రాంతంలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని, హంద్రీ-నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం 3 రేడియల్ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 83,949 క్యూసెక్కుల నీటిని మొత్తం జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 1,60,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడచిన 24గంటల వ్యవధిలో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల నుంచి గరిష్టంగా 32.910 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి గ్రిడ్‌కు అందించారు. గడచిన 24గంటల వ్యవధిలో జలాశయానికి 1,55,309 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి 1,55,309 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేశారు.