ఎంఎల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా! ఐతే వీటిని పాటించాలి: కాంగ్రెస్
చండీగఢ్
మరో కొద్ది రోజుల్లో హరియాణ అసెంబ్లీ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానున్న నేపద్యం లో ఇప్పటికే పార్టీలన్ని అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాల వంటి అంశాల గురించి కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. పార్టీ టికెట్ ఆశించేవారు తప్పకుండా వీటిని
పాటించాలని పేర్కన్నది. ఈ మేరకు ‘ఘోష్నా పత్ర’ పేరుతో ఉన్న నియమాల జాబితాను హరియాణా కాంగ్రెస్ చీఫ్ సెల్జా కుమారి ట్వీట్ చేశారు. మంచి వారు, అంకితభావం గల అభ్యర్థులను ఎంపిక చేయడం కోసమే ఈ నియమాలను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.దీని ప్రకారం హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించే వారు మద్యం సేవించమని.. ఖాదీ వస్త్రాలు ధరిస్తామని స్పష్టం చేయాలి. గాంధీమార్గంలో పయనిస్తూ.. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇవ్వాలి. అంతేకాక లౌకిక వాదాన్ని విశ్వసిస్తామని.. కుల, మత విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయనని ప్రమాణం చేయాలి. అంతేకాక జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థి టికెట్ ఆశిస్తే.. రూ.5000 చెల్లించాలని.. ఎస్సీ అభ్యర్థులైతే రూ. 2వేలు, మహిళా అభ్యర్థులైతే రూ.3000 చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కోసం భారీ ఎత్తున బరిలోకి దిగుతుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. గతంలో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితం అయ్యింది.