ఆసరా పెన్షన్లకు నిధుల కొరత లేదు : దయాకరరావు
హైద్రాబాద్,
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పెన్షన్ల పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ఆసరా పెన్షన్ల పథకం కింద 39,41,976 మంది లబ్ధి పొందారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆసరా పెన్షన్ల లబ్దిదారుల వయసును 57 సంవత్సరాల వయసుకు కుదించాం. వారికి కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఈ వివరాలను కలెక్టర్ల ద్వారా సేకరిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తామన్నారు. ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు. పొరపాట్లుంటే సవరిస్తున్నాం. దేశంలో ఇలాంటి పథకం లేదు. ఇంత పెద్దమొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. ఆసరా పెన్షన్ల కోసం ఏటా రూ.9,402.48 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రూ.9,192.88 కోట్లు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటా 209.60 కోట్లు మాత్రమే. రాజస్థాన్‌లో రూ.750, మహారాష్ట్రలో రూ.600, గుజరాత్‌లో రూ.500, ఉత్తరప్రదేశ్‌లో రూ.500, పంజాబ్‌లో రూ.500 చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు. దేశంలో ఎక్కువ మందికి, ఎక్కువ నగదు ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఈ పథకం వృద్ధులకు ఓ వరంగా మారింది అని మంత్రి తెలిపారు.